
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన‍్నారు. ఏపీలో వైఎస్ జగన్ గెలవడం ఓ చారిత్రక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అంటే ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను అన్నవిధాలుగా మోసం చేశారన్నారు. ముస్లింలకు చంద్రబాబు చేసినంత అన్యాయం మరెవ్వరూ చేయలేదని ఒవైసీ మండిపడ్డారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజకీయ అవసరం కోసం ఆ పార్టీని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక బాబు మళ్లీ బీజేపీ పంచన చేరతారని అన్నారు.
బీజేపీతో చంద్రబాబు రెండుసార్లు పొత్తు పెట్టుకుని, వైఎస్ జగన్‌కి, మోదీకి పొత్తు ఉందని విషప్రచారం చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబును మించినవారు లేరన్నారు. మోదీతో వైఎస్ జగన్ కలుస్తారనేది ప్రపంచంలోనే పెద్ద అబద్ధమని ఒవైసీ పేర్కొన్నారు. ఏపీలో అయిదేళ్లపాటు ముస్లింలకు అన‍్యాయం చేసిన చంద్రబాబు ...ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని అబద్ధం చెబుతున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు జరుగుతుంటే..చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒవైసీ తూర్పారబట్టారు. చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ నమ్మరని, ఆయన పచ్చి రాజకీయ అవకాశవాది అని విమర్శలు గుప్పించారు. విశ్వసనీయతలేని చంద్రబాబుకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని అన్నారు.
ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ ఒక లెజెండ్ అని, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని ఒవైసీ ప్రశంసలు కురిపించారు. వైఎస్సార్ చేసిన మేలును ముస్లిం సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఏపీలో ముస్లింలందరూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉన్నారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా ఏపీకి వైఎస్ జగన్ పూర్వ వైభవం తీసుకొస్తారన్నారు. పరిపాలనపై వైఎస్ జగన్‌కు ఒక విజన్ ఉందని, వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అద్భుతమన్నారు. 3వేలకు పైగా పాదయాత్ర చేసి...ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారన్నారు. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ‘రావాలి జగన్-కావాలి జగన్’ నినాదం మార్మోగుతోందన్నారు. రాష్ట్రాన్ని వైఎస్ జగన్ గణనీయంగా అభివృద్ధి చేస్తారని నమ‍్ముతున్నానని అన్నారు. కేవలం ముస్లింలే కాదని, అన్నివర్గాల ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేయాలని ఒవైసీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment