
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి. డ్వాక్రా రుణాల మాఫీ, రాష్ట్రంలో భూముల పునఃపరిష్కార సర్వే, భాషా పండితుల పదవులస్థాయి పెంపు, చెరుకు రైతులకు విత్తనంపై సబ్బిడీ, పేదలకు ఇళ్లపట్టాలు, అంగన్‌వాడీ ఆయాల అర్హతలు, ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, బనగానపల్లె నియోజకవర్గంలో రాళ్ల పేల్చివేత కార్యకలాపాలు, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రాష్ట్రంలో పడిపోతున్న విద్య నాణ్యత, నీటిపారుదల రంగం వంటి అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి.
అలాగే విశాఖపట్నం జిల్లాలో దివీస్ ఫార్మా వల్ల కాలుష్యం, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, న్యాయవాదుల సంక్షేమం, ఉపాధి కల్పనా కేంద్రాలు, మహిళలపై దురాగతాలు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీ నిధులు, అనంతపురం జిల్లాలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీ అవినీతి, కాకినాడలో హార్వర్డ్ పార్క్, పెండెకల్లులో పీహెచ్‌సీ, రాజధాని నగర అభివృద్ధి వంటి అంశాలు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి.