
వాజ్‌పేయి హయాంలో పార్లమెంటుపై దాడి జరిగిందీ ఆ తేదీనే.
భారతీయ జనతా పార్టీకే కాదు.. ఎందరికో ఆయన స్ఫూర్తినిచ్చిన నాయకుడు. ఇతర పార్టీలు సైతం ఆయన రాజనీతిజ్ఞతను పొగిడారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత. గొప్పవాళ్లు అని చెప్పుకునే వారెందరో ఆయనను కీర్తించినవారే. బీజేపీని స్థాపించిన వారిలో ఆయన ఒకరు. విలువలు గల రాజకీయ నేత. మూడుసార్లు ప్రధాని పీఠమెక్కి చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచిన గొప్పనేత.
జాతీయ రహదారులను అనుసంధానిస్తూ చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం, పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నం, పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ విజయం ఆయన హయాంలోనే.. తమ పార్టీ నేతలు తప్పు చేసినా ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించేవారు కాదు. ఉత్తమ నేతగా ఎందరితోనో ప్రశంసలు అందుకున్నది మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి. ఇలాంటి మహనీయుడి అస్తమయంతో దేశం మహా నాయకుడిని కోల్పోయిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
నంబర్ 13 దురదృష్ట సంఖ్యేనా?
1996 మే 16వ తేదీన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి 13 రోజులు మాత్రమే పని చేశారు. 1998లో రెండవసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టి పదమూడు నెలలకు ప్రభుత్వం మైనారిటీలో పడింది. అనంతరం 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో పార్లమెంటుపై దాడి జరిగిందీ 13వ తేదీనే.
అందుకున్న అవార్డులు:
వాజ్‌పేయికి 1992లో పద్మవిభూషణ్ అవార్డు, 1993లో కాన్పూరు విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం, 1994లో లోక్‌మాన్య తిలక్ అవార్డు, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డులు లభించాయి. దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న 2015లో అందుకున్నారు.