సాక్షి, తాడేపల్లి : అన్నను అడ్డుపెట్టుకుని ఎదిగినవాడిని కాదని.. తాను స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిని అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సినిమా వాళ్లంటే తమకు గౌరవం ఉందని.. అయితే పవన్ భాష మాత్రం మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. లాంగ్ మార్చ్ పేరిట విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాపు యువతను పక్కదోవ పట్టించేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాటి మీటింగ్ తర్వాత పవన్ అమాయకత్వం, అపరిపక్వత పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. పవన్ అఙ్ఞాతవాసి కాదు అఙ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివినంత మాత్రాన రాజకీయ నాయకులు కాలేరని పవన్‌కు చురకలు అంటించారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... ‘చంద్రబాబు ట్రాప్‌లో పడి చాలా ఇప్పటికే చాలా మంది నష్టపోయారు... ఆయనకు ఇప్పుడు మీరు దొరికారు. కమ్యూనిస్టులు, బీజేపీలు ఎలా ఆవిర్భవించాయో.... వాటి సిద్ధాంతాలేమిటో తెలుసా....? టీడీపీ లాంటి అవకాశవాద పార్టీలతో పని చేస్తున్న పవన్.... సిద్ధాంత పరంగా వైరుధ్యం కలిగిన పార్టీలను ఎలా కలుపుకొందామనుకున్నారు....? టీడీపీతో మీరు కలిసిపోతే మాకు అభ్యంతరం లేదు. కానీ చీకటి ఒప్పందం దేనికి? పవన్ ఇంకా సినిమా భ్రమలోనే ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా ఇసుక రవాణాలో వుంటే నిరూపించండి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఇసుక తీయడం కష్టతరంగా మారుతుందన్న విషయం తెలుసా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా....? మీరు మాకు రెండు వారాలు టైం ఇచ్చేందేంటి...? వరద తగ్గితే ఇసుక పంపిణీని పునరుద్ధరిస్తాం’ అని పవన్ తీరును ఎండగట్టారు. లాంగ్ మార్చ్ పేరు చెప్పి 2 కిలోమీటర్లు కూడా నడవలేని పవన్.... రాజకీయాల్లో ఎలా రాణిస్తారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక సీఎం జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ... ‘ దేశంలో కేసులు లేని నాయకులు ఎవరు? కక్షపూరిత రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం కొత్తేమీ కాదు. విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత పవన్‌కు లేదు. బొత్స, కన్నబాబుల గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం అన్యాయం. కాపుల్లో మీరు తప్ప ఇంక ఎవరూ ఎదగకూడదా...?ఎందుకు మీకా అక్కసు...? భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్.... ఒక సినిమా ఉచితంగా చేసి ఆ డబ్బు వాళ్ళకివ్వొచ్చు కదా...? పవన్ కల్యాణ్ ఇప్పటికే పార్టీ పెట్టి పరువు తీసుకున్నాడు. ఇంకా దిగజారిపోవద్దు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదు’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment