విజయవాడ : టీడీపీకి, కేంద్రానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం, అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి ఏపీ రాష్ట్రం అంటే చులకన భావం ఏర్పడిందని ఆరోపించారు. పోలవరం పెరిగిన అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు కావాలని, కేంద్రం సహకరించకపోవడంపై టీడీపీ నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. 2018 కల్లా పోలవరం పూర్తవడం కష్టమేనని, ఈ నెల 16న సీపీఐ నేతృత్వంలో పోలవరాన్ని సందర్శిస్తామని తెలిపారు. అక్కడ జరుగుతున్న విషయాలను బహిర్గతం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రేపు(శుక్రవారం) విజయవాడలో విద్యార్ధి సంఘాలతో సమావేశం నిర్వహించి, విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment