3వ డివిజన్‌లోని బలరాం కాలనీలో పర్యటిస్తున్న బాలినేని
ఒంగోలు: నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఎందుకు నష్టం వస్తోంది? ఇందుకు కచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే పర్సంటేజీల అవినీతే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్థానిక 3వ డివిజన్లోని కరణం బలరాం కాలనీలో ఆదివారం ఆయన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం చేపట్టారు. ఒకప్పుడు ఏ పనిచేసినా ఎంతో కొంత లెస్‌లకు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని లాభం పొందేవారని గుర్తు చేశారు. నేడు నిర్ణయించిన ధరకన్నా అధికంగా వేసినా కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని ఎమ్మెల్యే పేర్కొనడం చూస్తే ఆయన అవినీతి పర్వం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవాలంటూ ఒంగోలు ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన గడపగడపకూ వెళ్లి ప్రజలతో రాబోయే ఎన్నికల్లో తన బలం, బలహీనతలు మీరేనని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల గురించి తెలియజేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ విధంగా కాపీ కొడుతున్నారో వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు డబ్బులు తీస్తున్నాడని, లేకుంటే జనాన్ని పట్టించుకునేవాడే కాదని బాలినేని విమర్శించారు.
శివారు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. సురక్షిత నీరు, మురుగు నీటి పారుదల వ్యవస్థలను మెరుగు పరచకుండా ఓట్లు అడిగే ధైర్యం అధికార పార్టీకి ఎక్కడ ఉందో ప్రశ్నించాలన్నారు. కుటుంబాలు పెరిగినా ఎప్పుడో ఇచ్చిన ఇళ్లల్లో ఇంకా మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. శివారు కాలనీల ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ఆయా కాలనీల్లో ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని భరోసా ఇచ్చారు. పొదుపు మహిళల రుణాలను దశల వారీగా రద్దు చేస్తామని చెప్పారు. పోతురాజు కాలువను అభివృద్ధి చేసి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు.
దోమలు లేని ఆహ్లాద వాతావరణ పరిస్థితులు తీసుకొస్తామని, వృద్ధులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తామంటూ వైఎస్సార్ సీపీ ఏ వి«ధంగా ప్రజలకు అండగా ఉండబోతుందో తెలియజేస్తూ ఆసరా ఇస్తే అండగా నిలుస్తానంటూ ప్రజలకు బాలినేని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, 3వ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, నాయక్, సుల్తాన్‌బాషా, షేక్ ఆరిఫ్, రంగారావు, ఎండీ షరీఫ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూళిపూడి ప్రసాద్‌నాయుడు, దేవరపల్లి అంజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురిణి ప్రభావతి, మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి ఇందిర, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం ఇన్‌చార్జి బైరెడ్డి అరుణ, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు షేక సలాం, కరిముల్లా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, ఓగిరాల వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment