మాట్లాడుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
రాబోయే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చే వారికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పలు కాలేజీల విద్యార్థులతో బాలినేని ఆదివారం ముఖాముఖి నిర్వహించారు.
ఒంగోలు:పేద విద్యార్థుల చదువుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అండగా నిలిచిందని మాజీమంత్రి, వైనెస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చేవారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడి వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పలు కాలేజీలకు చెందిన విద్యార్థులతో బాలినేని ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో జిల్లాలో శాశ్వత అభివృద్ధికి చిరునామాగా రామతీర్థం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్టు, రిమ్స్ తీసుకురావడంతోపాటు దాదాపు 70 శాతానికి పైగా వెలిగొండ ప్రాజెక్టు పనులు, మినీ స్టేడియం, నగరంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా ఏడు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామన్నారు. శివారు కాలనీల్లో 8 వేలకు పైగా పట్టాల పంపిణీతోపాటు 2,500కు పైగా గృహాల నిర్మాణం పూర్తిచేయగలిగామన్నారు.
యూనివర్శిటీ కోసం 150 ఎకరాల భూమిని పేర్నమిట్ట వద్ద గుర్తించామని, వైఎస్సార్ జీవించి ఉంటే వర్శిటీ ఈ పాటికి పూర్తయ్యేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అభివృద్ధి జరిగిందని, ఈ నేపథ్యంలో నాలుగేళ్లు దాటినా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు. అకడమిక్ వర్శిటీని సైతం ఏర్పాటు చేయలేకపోయిన టీడీపీ నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హడావుడిగా శంకుస్థాపనలు, నిరుద్యోగ భృతి పేరుతో మభ్యపెడుతున్నారన్నారు. విద్యార్థులకు అండగా ఉంటానని, ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరినీ ఒక గ్రూప్‌గా చేసే ప్రక్రియ మొదలైందని, జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిద్దామన్నారు. నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు మాట్లాడుతూ.. అధికారదాహం, ధనదాహంతో టీడీపీ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఒంగోలుకు మంజూరైన ట్రిపుల్ ఐటీ నిర్మాణంలో తాత్సారం చేసి చివరకు పామూరులో శంకుస్థాపన చేశారన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, విద్యార్థి విబాగం నగర అధ్యక్షులు దాట్ల యశ్వంత్‌వర్మ, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ధ్వజమెత్తారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన బాచి, రాచమల్లు బ్రహ్మారెడ్డిని విద్యార్థులు అభినందించారు. విద్యార్థులతో ముఖాముఖి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని గజమాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment