బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న బండి సంజయ్. చిత్రంలో లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్, డి. అరవింద్, మురళీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ వచ్చినందునే ముందస్తు ప్రణాళిక ప్రకారం ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా సీఎం రాష్ట్రంలో కరోనా టెస్టులను ఆపేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గొప్పతనం కోసం మే 7వరకు లాక్‌డౌన్ పొడిగించిన సీఎం.. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాక హైదరాబాద్ సహా జిల్లాల్లో లాక్‌డౌన్ ఎలా అమలవుతుందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే, దమ్ముంటే ఒక్కసారి పాతబస్తీకి వెళ్లి లాక్‌డౌన్ అమలు తీరును చూడాలన్నారు. లేదంటే డ్రోన్ కెమెరాలతో చూడాలన్నారు. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలు చేయడం చేతకాకపోతే కేంద్ర బలగాలను దింపాలన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణం మర్కజ్ అని, అక్కడికి వెళ్లొచ్చిన వారి వల్ల ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరిస్తుంటే ప్రభుత్వం మైనారిటీ సంతుష్టీకరణ కోసం పనిచేస్తోందన్నారు.
కరోనా కేసులు ఒకేసారి ఎలా తగ్గాయి?
ఇతర రాష్ట్రాలు కరోనా టెస్టులను పెంచుతుంటే రాష్ట్రంలో ఆపుతున్నారని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టు చూపుతున్నారనే అనుమానం వస్తోందన్నారు. వాటిని నివృత్తి చేయాలని అడిగితే విమర్శలు చేస్తున్నారన్నారు. టెస్టులు ఆపడమే కేసులు తగ్గడానికి కారణంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో రోజూ 2వేల మందికి టెస్ట్‌చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని, గద్వాల, వికారాబాద్‌లో పరీక్షలు ఎందుకు ఆపేశారని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆరా? ఒవైసీనా?
మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్ఛందంగా బయటకు రావాలని చెప్పే విషయంలో ఒవైసీలాంటి వారు ఎందుకు స్పందించలేదని సంజయ్ ప్రశ్నించారు. ఒవైసీ పరోక్షంగా సీఎం పాత్ర పోషిస్తున్నారన్నారు. సీఎం కేసీఆరా? ఒవైసీనా అనే పరిస్థితి నెలకొందన్నారు. కాషాయం అంటే సీఎంకు భయం పట్టుకుందన్నారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ అనుసరించే విధానాల వల్ల సమాజంలో చీలిక వస్తోందన్నారు.
బాధ్యతలు స్వీకరించిన సంజయ్
మార్చి 11న బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన బండి సంజయ్‌కుమార్.. బుధవారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా కట్టడికి పక్కా చర్యలు చేపడుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు, వసతులపై ఏర్పాటైన కమిటీ సంజయ్‌కి నివేదిక అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment