కరీంనగర్‌సిటీ: బీజేపీ నేత బండి సంజయ్ పార్టీలో ఉన్నాడా..? హిందూత్వ ఎజెండాతోనే పనిచేస్తున్నాడా..? అంటూ రెండు నెలలుగా ఉన్న ఇటు పార్టీల్లో అటు హిందూత్వ వర్గాల్లో.. సంజయ్ అభిమానుల్లో నెలకొన్న సందిగ్దానికి సోమవారం తెరపడింది. బీజేపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న బండి సంజయ్‌కుమార్ రెండు నెలల క్రితం పార్టీని వీడుతున్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే రాజకీయాలకు స్వస్థి పలుకుతున్నానని, హిందూ ధర్మ రక్షణకు పాటుపడతానని సంజయ్ పేర్కొన్నారు. పార్టీలో పనిచేసిన వారికి ప్రాధాన్యత లేదని, గ్రూపు తగాదాలతో అణచివేస్తున్నారంటూ ఆయన మనోవేదనను వెల్లగక్కారు.
అయితే.. ఈ విషయంలో సంజయ్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వర్గీయులు, పార్టీ పెద్దలు, ఆరెస్సెస్ ప్రముఖులు ఆయనతో పలుమార్లు చర్చించినట్లు తెలిసింది. ఇక రాబోయే ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ లేనట్లేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా.. ఇతర పార్టీలకు చెందిన వారు ఒకింత సంబరపడ్డారు. కరీంనగర్‌లో ఇటీవల భారీఎత్తున హిందూశంఖారావం నిర్వహించగా దానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి బండి సంజయ్‌ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ చేసిన ప్రసంగంతో సంజయ్ బీజేపీలో కొనసాగుతున్నట్లే అనిపించింది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం కూర్చుని మాట్లాడుకుందామనే సంకేతాలు కూడా ఇచ్చారు. రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే.. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పటిష్టత, కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయనతో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ పాల్గొన్నారు. సమావేశంలో లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బండి సంజయ్ కుమార్ పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు తెలపడంతో పార్టీకి, సంజయ్‌కి మధ్య ఉన్న దూరం తొలగినట్లే స్పష్టమైంది. ఇక సంజయ్ పార్టీ అధికార ప్రతినిధిగానే కార్యక్రమాలు చేపడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
బండి సంజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసు బేరర్స్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లాను. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే పాల్గొన్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment