
అమలాపురం (ఏపీ): కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని, అక్కడి తెలుగువారంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్‌ని ఎలాగైనా ఓడించాలని ప్రధాని నరేంద్రమోదీ వీధి స్థాయి నాయకునిలా దిగజారి మరీ ప్రచారం చేశారన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అంటూ మోదీ చేసిన అడ్డగోలు సంస్కరణలతో ఇబ్బందులు పడిన ప్రజలు కర్ణాటక ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పనున్నారని జోస్యం పలికారు. సమావేశంలో గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, ఏఐసీసీ సభ్యుడు కేబీఆర్ నాయుడు, పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.