వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించే కుట్ర! | Bhuggana Rajendranath comments on Chandrababu about Votes Removal | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగించే కుట్ర!

Published Tue, Mar 5 2019 4:02 AM | Last Updated on Tue, Mar 5 2019 4:02 AM

Bhuggana Rajendranath comments on Chandrababu about Votes Removal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు ద్రోహుల పార్టీగా, తెలుగు ప్రజల సమాచార దొంగల పార్టీగా తెలుగుదేశం పార్టీ మారిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, శాసనసభా ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించి, తద్వారా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు సంస్థల వద్దకు ఎలా వెళ్లిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సమాచారం పొందిన బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ సంస్థలకు ప్రభుత్వంలోని పెద్దలతో సంబంధాలున్నాయని చెప్పారు. బ్లూఫ్రాగ్‌ సంస్థకు పంటల డేటా సేకరణ, సమాజ వికాసం, విద్యుత్‌ స్తంభాలకు జియో ట్యాగింగ్‌ వంటి కోట్లాది రూపాయలతో ముడిపడిన అనేక కాంట్రాక్టులను అప్పగించారని తెలిపారు. మరోవైపు.. సేవామిత్ర యాప్‌ ద్వారా ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీకి సేవలు అందిస్తోందన్నారు. ఈ రెండు సంస్థలకు చెందిన అశోక్, ఫణికుమార్‌లు అమరావతిలోని సీఎంవో లోనే ఉంటారని వివరించారు. వీటితోపాటు మరో మూడు కంపెనీల ప్రమేయం ఈ బాగోతంలో ఉన్నట్లు స్పష్టమవుతోందని బుగ్గన తెలిపారు. ఆధార్‌ డేటాను, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమాచారాన్ని, ప్రభుత్వం చేయించిన ప్రజాసాధికార సర్వే సమాచారాన్ని ఇంటిగ్రేట్‌ చేసి టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లోకి ఎక్కించి తదుపరి ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా పన్నాగం పన్నారని ఆయన ఆరోపించారు. 

‘సేవామిత్ర’లో సమస్త సమాచారం
సేవామిత్ర యాప్‌ ఓపెన్‌ చేస్తే ప్రతీ ఓటరు కలర్‌ ఫొటోతో పాటు భార్యాపిల్లల పేర్లు, వయసు, వారి వ్యక్తిగత వివరాలతో కూడిన మొత్తం సమాచారం, బ్యాంకు ఖాతాలు, వారికి ప్రభుత్వం నుంచి అందిన లబ్ధి.. ఇలా చాలా సమాచారం దర్శనమిస్తోందని.. కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుందని.. అది ఐటీ గ్రిడ్స్‌ వద్ద, సేవామిత్ర యాప్‌లో ఎలా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో పాటు వ్యక్తిగత సమాచారం గోప్యతను పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆధార్‌ డేటా కూడా ఈ కంపెనీలకు ఎలా చేరిందన్నారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014లో మాత్రమే ఏర్పడిందన్నారు. ఆ తరువాతే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం చేపట్టిందని, అనంతరం ఈ సంస్థల ద్వారా ఒక పథకం ప్రకారం కుట్రలు కొనసాగించినట్లు అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంత బాగోతం నడిపిన సీఎం తన బండారం బయటపడడంతో ఇతరులపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని.. తిరిగి దబాయించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.   

ఏడాదిన్నరగా ఓట్ల తొలగింపు..
ఇదిలా ఉంటే.. ఓట్ల తొలగింపు వ్యవహారం ఏడాదిన్నరగా జరుగుతోందని, దీనిపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, లోకేశ్వరరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇవన్నీ బయటపడడంతో హడావుడిగా సేవామిత్ర యాప్‌లో కలర్‌ ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను, ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారాన్ని తొలగించారన్నారు. ప్రజాసాధికార సర్వే డేటా మొత్తం అహ్మద్‌ బాబు బాధ్యుడిగా ఉన్న ఆర్‌టీజీఎస్‌ వద్ద ఉందని.. అలాగే, యూఐడీఏఐలో గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఐఎఎస్‌ అధికారి జె.సత్యనారాయణ ఏపీలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్నారని బుగ్గన వెల్లడించారు. ఈయనకు గతంలో ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించినప్పటికీ మళ్లీ తాజాగా అమరావతిలో ఇచ్చారన్నారు. సత్యనారాయణను ఐటీ సలహాదారు బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. స్టేట్‌ రెసిడెంట్స్‌ డేటా హబ్‌లో ఉండే సమాచారం అధారంగా ఓటర్ల జాబితాను టీడీపీ, వైఎస్సార్‌సీపీ, తటస్థ, స్థానికంగా లేని వారు.. ఇలా 4 విభాగాలుగా విభజించారని బుగ్గన చెప్పారు. ఈ డేటా ఆధారంగా వైఎస్సార్‌సీపీ వారిని గుర్తించి వారి ఓట్లు తొలగింపజేయడం, తటస్థ ఓటర్లను ప్రలోభ పెట్టడం, స్థానికంగా లేనివారి ఓట్లను తామే వేసుకోవడానికి పన్నాగం పన్నారన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఈ సమాచారాన్ని కూడా వారికి తెలియకుండా దొంగిలించారని ఆయన ఆరోపించారు.   గతంలో ఓటరు పేరు చేర్చాలన్నా, తొలగించాలన్నా టీచర్లు ఇతర రెగ్యులర్‌ సిబ్బంది ద్వారా చేయించే వారని, ప్రస్తుతం ఈ కార్యక్రమం చేస్తున్న బీఎల్‌ఓలు, అంగన్‌వాడీ కార్యకర్తలంతా కాంట్రాక్టు సిబ్బందే కావడంతో వారిపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తూ అక్రమాలకు దిగుతున్నారన్నారు. 

అసలైన దోషులెవరో తేల్చాలి
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? లేక ఆ కంపెనీయే అపహరించిందా.. దీని వెనుక ఎవరున్నారు? అసలు దోషులెవరు? అన్న అంశాలు తేలాలని.. దీనిపై ఎన్నికల సంఘం లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని బుగ్గన డిమాండ్‌ చేశారు. ఆధార్‌ డేటా కూడా వీరికి ఎలా చేరిందో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) విచారణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు.. బ్యాంకు ఖాతాలు, పేటీఎం వంటి యాప్‌లు, ఈమెయిళ్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని ప్రజలకు బుగ్గన సూచించారు. ఈ డేటాను దుర్వినియోగం చేస్తే ప్రజలకు చాలా నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement