నేరాన్ని దాచేందుకు ఎదురుదాడి | Fake and bogus votes that reached 5918631 by January | Sakshi
Sakshi News home page

నేరాన్ని దాచేందుకు ఎదురుదాడి

Published Thu, Mar 7 2019 3:43 AM | Last Updated on Thu, Mar 7 2019 8:56 AM

Fake and bogus votes that reached 5918631 by January - Sakshi

సాక్షి, అమరావతి: ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే... దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా అధికార తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం సాగిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని ప్రైవేట్‌ సంస్థకు అప్పగించి ఘోరమైన నేరానికి పాల్పడటమే కాకుండా ఆ సమాచారం ఆధారంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, కొందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇదేం అరాచకమని ప్రశ్నించిన ప్రతిపక్షంపై టీడీపీ–ఎల్లో మీడియా ఒకే శ్రుతిలో ఎదురుదాడి ప్రారంభిం చాయి. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

రాష్ట్రంలో 59 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నట్లు ఐటీ నిపుణుల పరిశోధనలో ఇప్పటికే తేటతెల్ల మైంది. వాటిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ గతంలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాము గుర్తించిన బోగస్‌ ఓట్లను తొలగించాలని కోరుతూ కొన్నిచోట్ల ఫారం–7 దరఖాస్తులను కూడా తాము ఇచ్చినట్టు వైఎస్‌ జగన్‌ నిండు బహిరంగ సభలోనే చెప్పారు. అయితే, తాను చేసిన ఘోరమైన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పంతా ప్రతిపక్షానిదే అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్లో మీడియా తంటాలు పడుతున్నారు. నలుగురూ నవ్విపోతారని తెలిసి కూడా డేటా చౌర్యంపై తప్పుడు ప్రచారానికి తెరతీయడం చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.  (ఇదీ జరుగుతోంది!)

గుట్టు రట్టు కావడంతో బాబు బెంబేలు 
బోగస్‌ ఓట్లను, డూప్లికేట్‌ ఓట్లను తప్పుడు మార్గాల్లో నమోదు చేయించడమే కాకుండా, తమకు ఓటు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పనిని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఇందుకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే పథకం రచించారు. ప్రజా సాధికార సర్వే, ఆర్టీజీఎస్‌ సర్వే ఇలా పలు మార్గాల్లో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రభుత్వం సేకరించిన ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌ అనే అస్మదీయ కంపెనీకి చేరవేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందజేయడం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని సాక్షాత్తూ సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యాప్‌ ‘సేవామిత్ర’ను రూపొందించింది ఐటీ గ్రిడ్స్‌ కంపెనీయే కావడం గమనార్హం.

ప్రజల వ్యక్తిగత డేటాను పార్టీ యాప్‌లో చేర్చారు. దాని ఆధారంగా ఓట్ల తొలగింపునకు కుట్ర సాగించారు. తాను ఇన్నాళ్లూ చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. డేటా చౌర్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారు. ప్రతిపక్ష నేతలే తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ చంద్రబాబు, ఆయన అనకూల మీడియా దుష్ప్రచారం ప్రారంభించారు. అసలు ప్రజల వ్యక్తిగత సమాచారం, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండే కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా వంటివి ఐటీ గ్రిడ్స్‌కు, సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చాయో సమాధానం మాత్రం చెప్పడం లేదు. పైగా తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన డేటాను చోరీ చేశారంటూ గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం గమనార్హం. తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా దబాయింపులో భాగంగానే వారు పోలీసులను ఆశ్రయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

పథకం ప్రకారమే టీడీపీ కుట్ర 
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు సాధించిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 5 లక్షలే. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గేందుకు కుట్రలకు తెరలేపారు. దొంగ ఓట్లను చేర్చించడం, ప్రతిపక్షానికి పడే పడే ఓట్లను తొలగించడం అనే పన్నాగాన్ని అమల్లోకి తెచ్చారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం ఒక వ్యూహం ప్రకారమే ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌ వంటి కంపెనీలను తెరపైకి తెచ్చి, ప్రభుత్వంలో కాంట్రాక్టులను అప్పగించడంతో పాటు ఆ కంపెనీల ద్వారానే ఈ అక్రమ వ్యవహారాలను కొనసాగించినట్లు స్పష్టమవుతోంది.

ఐటీ గ్రిడ్స్‌ ఎండీకి టీడీపీ పెద్దల రక్షణ 
డేటా చౌర్యం బయటపడడంతో ఐటీ గ్రిడ్స్‌ ఎండీ, మంత్రి నారా లోకేశ్‌ సన్నిహితుడు డాకవరపు అశోక్‌ పరారయ్యాడు. అతడు ఏపీలోని టీడీపీ ముఖ్యనేతల వద్దే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అశోక్‌ సైబరాబాద్‌ పోలీసుల చేతికి చిక్కితే తమ బండారం బట్టబయలవుతుందన్న భయంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై నిస్సిగ్గుగా ఎదురుదాడి మొదలుపెట్టారు. అందుకే దీన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత డేటా చోరీ, ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదుపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేస్తోందని సీఎం చంద్రబాబు చెబుతుండగా, మంత్రి లోకేశ్‌ తమ డేటా పోలేదని ఒకసారి, తమ డేటాను తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లారని మరోసారి ప్రకటన చేయడం గమనార్హం. ప్రభుత్వ డేటా చోరీకి గురైందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అంగీకరించగా, ప్రభుత్వ డేటా చోరీకి గురికాలేదని, భద్రంగా ఉందని ఐటీ కార్యదర్శి, ఆర్టీజీఎస్‌ సీఈఓలు పేర్కొన్నారు.  

ప్రతిపక్ష మద్దతుదార్ల ఓట్లపైనే గురి 
డేటా చౌర్యంపై హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసుల విచారణలో విస్మయం కలిగించే అంశాలు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, మద్దతుదార్ల ఓట్లను తొలగించడంతోపాటు ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు, అసలు లేని వ్యక్తుల పేరిట సైతం ఓట్లు చేర్పిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ సేవామిత్ర యాప్‌ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా సైబరాబాద్‌ పోలీసుల విచారణలో బయట పడుతుండడం గమనార్హం. 

మొత్తం ఓట్లలో 15 శాతం నకిలీ ఓట్లే  
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు నమోదు అవుతున్నాయని గత ఏడాది ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌(వాస్ట్‌) సంస్థ ప్రతినిధులు లోకేశ్వరరెడ్డి, తదితరులు తమ అధ్యయనంలో గుర్తించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తే దాదాపు 52.67 లక్షల మేర నకిలీ, బోగస్‌ ఉన్నట్లు బయటపడింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం ఓట్లు నకిలీవేనని తెలుస్తోంది. ఈ ఓట్లలో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్నవి 34.17 లక్షలు ఉన్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలు. ఓటరుగా నమోదు కావాలంటే 18 ఏళ్లు నిండి ఉండాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. కానీ, ఏపీలో ఏడాది వయసున్న పసిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు చాలా ఉన్నాయి. 350 ఏళ్ల వ్యక్తుల పేరిట కూడా ఓట్లు ఉండడం విశేషం. ఇంటి నెంబరు, చిరునామా లేకుండానే లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. 
పది కేటగిరీలుగా నకిలీ, బోగస్‌ ఓట్లు ఎన్నెన్ని చేర్చారో కూడా తేలింది. 

- ఓకే ఓటర్‌ ఐడీతో ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండడం: 36,404 
ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, జెండర్‌ ఒకేలా ఉన్న నకిలీ ఓట్లు: 82,788
ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్‌ జెండర్‌ ఒకేలా ఉండి వయసులో మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 24,928 
ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటి నెంబర్, వయసు ఒకేలా ఉండి జెండర్‌ మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 1,006 
ఓటరు పేరు, ఇంటి నెంబరు, వయసు, జెండర్‌ ఒకేలా ఉండి తండ్రి/భర్త పేరు మాత్రమే తేడా ఉన్న నకిలీ ఓట్లు: 92,198 
ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేయించిన నకిలీ ఓట్లు: 2,60,634 
ఓటరు పేరు తండ్రి/భర్త పేరు ఒకేవిధంగా ఉండి ఇతర వివరాలు వేరేగా మార్పులు చేసి నమోదైన నకిలీ ఓట్లు: 25,17,164 
వయసు తప్పుగా ఉన్న ఓట్లు (18 ఏళ్లకంటే తక్కువ, 100 ఏళ్లకన్నా ఎక్కువ–గరిష్టంగా 350 ఏళ్ల వయసుతో ఉన్న నకిలీ ఓటర్లు): 6,126
ఇంటి నెంబరు తప్పుగా ఉన్న ఓట్లు (ఇంటి నెంబర్‌ స్థానంలో నన్, సేమ్, ఓల్డ్, న్యూ, 000 తదితరాలతో ఉన్న నకిలీ ఓట్లు): 3,95,877 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదైన ఓటర్లు: 18,50,511 
వీటితోపాటు చనిపోయిన వ్యక్తుల పేరిట కూడా లక్షల సంఖ్యలో ఓట్లు ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తేలింది. 

మరో 6 లక్షల బోగస్‌ ఓట్లు 
నకిలీ, బోగస్‌ ఓట్లకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఆయా ఓటర్ల పేర్లతో కూడిన సాక్ష్యాధారాలను కూడా వాస్ట్‌ సంస్థ సేకరించింది. ఈ బోగస్, నకిలీ ఓట్లను తొలగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వాస్ట్‌ సంస్థ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందించారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి వీటిపై విన్నవించాయి. 25,47,019 ఓట్లు నకిలీవి అన్న అనుమానాలు ఉన్నాయని, వీటన్నిటిపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన ఓటరు జాబితాను పరిశీలించిన వారికి నిరాశే ఎదురైంది. నకిలీ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి.

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే క్షేత్రస్తాయిలో నకిలీ ఓట్లు తగ్గకపోగా మరిన్ని చేరాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓట్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా గతంలో టీచర్లు లేదా రెగ్యులర్‌ ఉద్యోగులు ఆ బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ, ఈసారి ఈ పనిని క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అప్పగించారు. వీరంతా ప్రభుత్వం నియమించినవారే. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మరో 6 లక్షల బోగస్‌ ఓట్లను చేర్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 3.52 కోట్లుండగా, ఈ ఏడాది జనవరి 11వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఈ ఓట్ల సంఖ్య 3.69 కోట్లకు చేరినట్లు చూపించారు. అంటే సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు కొత్తగా 18 లక్షల ఓట్లు పెరిగాయి.

కొత్త ఓటర్లు చేరినా నకిలీ ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉన్నందున మొత్తం ఓట్ల సంఖ్య తగ్గాల్సి ఉన్నప్పటికీ గతంలో కంటే భారీగా పెరగడం గమనార్హం. కొత్త జాబితాలో కూడా నకిలీ, బోగస్‌ ఓట్లు 6 లక్షల వరకు ఉన్నాయని వాస్ట్‌ సంస్థ గుర్తించింది. జనవరి నాటికి నకిలీ ఓట్ల సంఖ్య 59,18,631కు చేరినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ పెద్దలు దగ్గరుండి మరీ నకిలీ, బోగస్‌ ఓట్లను చేర్పించడం వల్లే మొత్తం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా... 
నకిలీ, బోగస్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఇంతకు ముందు దీనిపై ఫిర్యాదులు ఇచ్చారు. అయినా నకిలీ, బోగస్‌ ఓట్లు తగ్గడానికి బదులు మరిన్ని పెరగడం విస్మయానికి గురిచేస్తోంది. జనవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాను పరిశీలించిన వాస్ట్‌ సంస్థ నకిలీ, బోగస్‌ ఓట్లు ఏ మేరకు ఉన్నాయో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జాబితాలోని వారి పేర్లు కొత్త ఓటర్ల జాబితాలో వేరే నియోజకవర్గాల్లో ఓటర్లుగా దర్శనమిస్తున్నాయి. అంటే ఒకరి పేరునే మరో నియోజకవర్గంలో మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించినట్లు స్పష్టమవుతోంది. ఇదేకాకుండా ఒకే బూత్‌లో ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు కూడా ఈ కొత్త జాబితాలో దర్శనవిస్తుండడం విశేషం. చిన్నపిల్లల పేర్లతో ఓట్లు, మరణించిన వారి ఓట్లు లక్షకు పైగానే ఉన్నాయని గత సెప్టెంబర్‌ తేలింది. అవే ఓట్లు ఈసారీ కొనసాగుతున్నాయి. అవి ఇలా ఉన్నాయి.

- ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్నవారు: 9,552 
(సెప్టెంబర్‌ జాబితాలో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఏబీ10419705 ఐడీ నెంబర్‌తో శివశంకర నల్లపాటి అనే ఓటరు పేరు నమోదై ఉంది. అదే వ్యక్తికి మళ్లీ తాజా జాబితాలో అదే ఐడీ నెంబర్‌తో అదే జిల్లాలోని తాడికొండలో మరో ఓటు నమోదు కావడం విశేషం)
- ఒకే రకమైన సమాచారంతో వేర్వేరు ఐడీ నెంబర్లతో ఓట్లు కలిగిన వారు: 78,156 
(ఉదాహరణకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏజీజెడ్‌3079639 ఐడీ నెంబర్‌తో అభినయ్‌ మన్నెం అనే ఓటరు పేరు ఉండగా, అదే ఓటరు పేరుతో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో టీఎంఓ02312932 నెంబర్‌తో మరో ఓటు నమోదైంది. ఇలాంటివే మరెన్నో ఉన్నాయి)

-  వయసులో మార్పుచేసి రెండేసి ఓట్లు కలిగిన వారు: 52,180 
(పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని 233 బూత్‌లో అఖిల గెడ్డం (24 ఏళ్లు) పేరు, ఇతర వివరాలతో ఓటు ఉంది. అవే వివరాలతో వయసును 23 ఏళ్లుగా పేర్కొంటూ అదే నియోజకవర్గం పోలింగ్‌బూత్‌ 242లో కూడా మరో ఓటు నమోదైంది)
-  వ్యక్తి జెండర్‌ను మార్పు చేయడం ద్వారా నకిలీ ఓట్లుగా నమోదైనవి: 1,224 
(తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం 27వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో అన్నమ్మ కొమ్మరి (మహిళ) అనే ఆమెకు ఓటు ఉంది. అదే పేరు, ఇతర వివరాలను యథాతథంగా ఉంచి మహిళకు బదులు పురుష అని జెండర్‌ను మార్పు చేసి మరో ఓటు అక్కడే నమోదైంది) 
- తండ్రి/భర్త పేరులో చిన్నమార్పుతో నమోదైన నకిలీ ఓట్లు: 1,78,868 
(విశాఖ జిల్లా భీమిలిలోని 305 బూత్‌లో ఆదిలక్ష్మి కొల్లి, భర్త అప్పలరాజు పేరుతో ఓటు ఉంది. భర్త పేరును అప్పల రాజు అని వేర్వేరు పదాలుగా చూపించి ఈ ఓటు నమోదు చేశారు. ఇదే పేరుతో భర్త పేరును అప్పలరాజుగా రెండు పదాలను ఒకటిగా కలిపి మరో ఓటు అదే పోలింగ్‌ బూత్‌లో నమోదు చేశారు.) 

-  ఓటరు పేరును ముందు వెనుకలు మార్పు చేసిన నకిలీ ఓట్లు: 1,69,448 
(శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని 315 బూత్‌లో కొర్రాయి ధనుంజయ్‌ (తండ్రి తులసయ్య) అనే పేరుతో ఓటు ఉండగా, ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్పుచేసి అదే చోట ధనుంజయ్‌ కొర్రాయి (తండ్రి తులసయ్య)అని మరో ఓటును నమోదు చేశారు. 
-  ఒకే వ్యక్తి పేరుతో ఇంటినెంబర్ల మార్పుతో ఒకే పోలింగ్‌బూత్‌లో రెండుసార్లు నమోదు చేసిన నకిలీ ఓట్లు:    25,17,630 
(కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం 22వ పోలింగ్‌బూత్‌లో అశ్వనికుమార్‌ సమ్మెట, తండ్రి వెంకటేశ్వరరావు సమ్మెట, ఇంటి నెంబర్‌ 1.13 అనే పేరుతో ఒక ఓటు ఉండగా, అదే పేరుతో ఇంటి నెంబర్‌ను 1.19గా మార్చి అక్కడే మరో ఓటు కూడా తాజా జాబితాలో నమోదు చేశారు) 

-  ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ఇంటినెంబర్లతో వేర్వేరు బూత్‌లలో నమోదైన రెండేసి ఓట్లు: 4,49,126 
(విజయవాడ సెంట్రల్‌లో 67వ పోలింగ్‌బూత్‌లో 13–2824 ఇంటి నెంబర్‌తో రెడ్డయ్య అర్ల పేరుతో ఒక ఓటు ఉండగా, అదే నియోజకవర్గంలోని మరో పోలింగ్‌బూత్‌లోనూ ఇంటి నెంబర్‌ను 24–1328గా మార్పు చేసి మరో ఓటు తాజా జాబితాలో నమోదు చేశారు)
-  పేరులో చిన్న అక్షరం మార్పుతో ఒకరికే రెండుకు మించి నమోదై ఉన్న నకిలీ ఓట్లు:    2,36,626 
(తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 140వ బూత్‌లో సుష్మ అనే పేరుతో ఒక ఓటు నమోదు చేశారు. తండ్రి పేరు, ఇంటి నెంబర్‌ ఇతర వివరాలు యథాతథంగా ఉంచి పేరులోని మొదటి అక్షరం ‘సు’కు బదులు ‘షు’ అని మార్చి షుష్మగా అదే పోలింగ్‌బూత్‌లో మరో ఓటు తాజా జాబితాలో చేర్చారు) 

- ఓటు హక్కు పొందేందుకు 18 ఏళ్లు ఉండాలి. కానీ, అంతకంటే తక్కువ వయసున్న వారి పేరిట కూడా ఓట్లు కొనసాగుతున్నాయి. వాటితోపాటు 100 ఏళ్ల నుంచి 351 ఏళ్లకు పైగా వయసున్న వారిపేరుతో ఉన్న ఓట్లు: 3,307 
(తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని 391బూత్‌లో నారాయణమ్మ వనం వయసు 351 పేరిట ఓటు ఉంది. కానీ, అదే ఐడీనెంబర్‌తో పేరును నారాయణమ్మకు బదులు వెంకటేశ్వర్లు వనం అని మార్పుచేసి వయసును 351 ఏళ్లుగా చూపించి ఓటును కొనసాగిస్తున్నారు) 
-  ఇంటినెంబర్లు లేకుండానే నమోదైన ఓట్లు: 2,15,119 
-  గత ఏడాది సెప్టెంబర్‌ నాటి జాబితా ప్రకారం ఏపీ, తెలంగాణల్లో రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు 18,50,511 మంది ఉండగా, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య 20,07,395కు చేరింది. 

చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం 
ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఈ నకిలీ ఓట్లపై సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, వచ్చే ఎన్నికలపై ఈ నకిలీ ఓట్లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏకంగా అరకోటికి పైగానే నకిలీ ఓట్లు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.  (‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement