సీఎంది సైబర్‌ నేరం | YS Jagan Complaint to the Governor on the It Grids Conspiracy | Sakshi
Sakshi News home page

సీఎంది సైబర్‌ నేరం

Published Thu, Mar 7 2019 3:35 AM | Last Updated on Thu, Mar 7 2019 5:03 PM

YS Jagan Complaint to the Governor on the It Grids Conspiracy - Sakshi

బుధవారం హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం చేసే దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్‌ నేరానికి పాల్పడ్డారని, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ప్రైవేటు కంపెనీలకు బదలాయించారని పేర్కొంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్‌ జగన్‌ పార్టీ ప్రతినిధి వర్గంతో కలసి వెళ్లి బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన సైబర్‌ నేరం రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. దీనిపై ఈ రోజు గవర్నర్‌ను కలిశామని, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా కలుస్తామని తెలిపారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

‘ఏపీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్‌ నేరానికి పాల్పడితే దొంగతనం కాదా? అని గవర్నర్‌ను కలసి చెప్పాం. చంద్రబాబు చేసిన తప్పు పనిని మేమిచ్చిన వినతిపత్రం ద్వారా చాలా వివరంగా తెలియజేశాం. ఒక పథకం ప్రకారం రెండేళ్ల కిందటి నుంచే చంద్రబాబు ఎన్నికలను మేనేజ్‌ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దుర్బుద్ధితో ఈ సైబర్‌ నేరానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీడియా కూడా ఆయన్ను ఈ ప్రశ్నలు అడగాలి. జరగకూడనిది ఎలా జరిగిందన్నది మీరు కూడా ప్రశ్నించాలి. ఐటీ గ్రిడ్స్‌ అనే ఒక కంపెనీ మీద రెయిడ్స్‌ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్‌ను తయారు చేసింది ఈ ఐటీ గ్రిడ్స్‌ వారే. ఈ సేవామిత్ర యాప్‌లో ఉండకూడని డేటా, ఎవరి వద్దా ఏ విధంగానూ ఉండకూడని ఆధార్‌ వివరాలు ఎలా కనిపిస్తున్నాయి? ఏ రకంగా ఐటీ గ్రిడ్‌ కార్యాలయం కంప్యూటర్లలో దొరుకుతున్నాయి? ఆధార్‌ వివరాలు ఒక ప్రైవేటు కంపెనీ వద్ద దొరకడం, టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లో దొరకడం సబబేనా? ఇది న్యాయమేనా? ఇది నేరం కాదా? ఇది ప్రజల వ్యక్తిగత వివరాల్లోకి చొరబడటం కాదా? (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

సర్వేల సమాచారం సేవామిత్రతో అనుసంధానం
కలర్‌ ఫోటోలతో కూడిన ఓటర్ల ఐడీ డేటా ఉన్న మాస్టర్‌ కాపీ ఎవరికీ అందుబాటులో ఉండదు. ఈ మాస్టర్‌ కాపీ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్స్‌ అనే కంపెనీ కంప్యూటర్లలో కనబడుతోంది? ఏ విధంగా టీడీపీ అధికార యాప్‌ అయిన సేవామిత్రలో ఇది ఉంది? ఇది కేంద్ర ఎన్నికల సంఘం డేటా. ఇక ఆధార్‌ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డేటా. ఇక మూడోది... రాష్ట్ర ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు.. ఒక వ్యక్తికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలన్నీ చంద్రబాబు దగ్గర ఉన్న సేవామిత్ర యాప్‌లో కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఏరకంగా ఐటీగ్రిడ్స్‌ ఆఫీసులోని వారి కంప్యూటర్లలో ప్రత్యక్షమవుతున్నాయి? టీడీపీ యాప్‌ సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు, అతనికి సంబంధించిన కలర్‌ ఫోటోతో కూడిన ఓటరు జాబితా వివరాలు మీ వద్ద ఉన్నాయంటే అర్ధం ఏమిటి? ఇవన్నీ మీ వద్ద ఉన్నప్పుడు, రేపు పొద్దున మీరేం చేసినా ప్రజలు మోసపోరా? నాశనం అయిపోరా? ఇలాంటి వివరాలు ప్రైవేటు వ్యక్తుల వద్ద గానీ, సంస్థల వద్ద గానీ అస్సలు ఉండకూడదు. (ఇదీ జరుగుతోంది!)

అలాంటిది ఇలాంటి వివరాలే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ప్రజల వద్దకు వెళ్లి పల్స్‌ సర్వే అని, ఆర్టీజీఎస్‌ అని రకరకాల సర్వేల పేరిట వారి సమాచారం సేకరించింది. అలా సేకరించిన డేటాను కూడా చంద్రబాబు గారి సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు. ఇలా అనుసంధానించిన డేటాను, సేవామిత్ర యాప్‌లో రిజిస్టర్‌ అయిన టీడీపీ నేతల ట్యాబ్‌లకు పంపించారు. టీడీపీ నేతలు వారి వారి గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ఓటరు ఎవరు? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు? వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఓటేస్తాడా? లేక టీడీపీకి ఓటేస్తాడా? అంటూ సర్వేలు చేశారు. ఆ తర్వాత ఎవరైతే టీడీపీకి ఓట్లేయరో వారి ఓట్లన్నీ ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారం తీసేయడం మొదలు పెట్టారు. మరోవైపు రెండేసి ఓట్లను చేర్చడం మొదలు పెట్టారు. టీడీపీకి అనుకూలమైన ఓటరు పేరు ఒకటి కాదు, రెండేసి కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు డూప్లికేట్‌ ఓటర్లను చేర్చి తమకు అనుకూలురైన ఓటర్ల సంఖ్యను పెంచడం, మరో వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చిన పని ఇదే. ఇదంతా గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం.
డేటా చోరీ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌. చిత్రంలో రాజన్నదొర, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఉమ్మారెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్థసారథి, కొడాలి నాని 

ఫామ్‌–6, ఫామ్‌–7 సమర్పించడం మా హక్కు
అసలు ఫామ్‌–7 అంటే ఏమిటి? ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి.. దర్యాప్తు చేయండి, వచ్చి చూసి ఎంక్వయిరీ చేసిన తర్వాత దొంగ ఓటు అని తేలితే ఆ ఓటును తీసేయండి? అని అర్థం. ఎన్నికల కమిషన్‌ చేయాల్సిన పనికి మేం సహకరించాం. దర్యాప్తు చేసి నిజం తెలుసుకోండి. చంద్రబాబు ఎంత దారుణంగా చేశారో చూడండి అని చెప్పాం. కానీ చంద్రబాబు పోలీసులను పంపి ఫామ్‌–7 దరఖాస్తు నింపి ఫిర్యాదు చేయడమే తప్పన్నట్లుగా వేధింపుల పర్వం ప్రారంభించారు. అసలు ఏపీ ప్రభుత్వానికి, దీనికి సంబంధం ఏమిటి? ఎన్నికల కమిషన్‌ అనేది ఒక ఖ్వాజీ జుడిషియల్‌ అథారిటీ (న్యాయపరమైన అధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ). దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ సంబంధమే లేదు. అలాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థకు.. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఫామ్‌–7 సమర్పించడం, ఇక్కడ మా ఓటరు నమోదు కాలేదు, నమోదు చేయండి అని ఫామ్‌–6ను సమర్పించడం అనేది మా హక్కు. మేం అప్లికేషన్‌ పెట్టగానే వాళ్లేమీ ఆ ఓట్లను తీసేయరు. అలాగే ఓట్లను చేర్చరు. మేం సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తొలుత సంబంధిత ఊరికి వచ్చి దర్యాప్తు చేయాలి.

దర్యాప్తులో మేం చెప్పింది సరైనదిగా తేలితే ఆ ఓటర్లకు టిక్‌ పెడతారు. డూప్లికేట్‌ అని తేలితే తీసేస్తారు. ఓటరును నమోదు చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు. ఇదొక ప్రక్రియ. ఇది ఎన్నికల కమిషన్‌కు సహకరించే ఒక బాధ్యత. ఇది మేమే కాదు విజ్ఞత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విజ్ఞత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ చానెల్‌ చేయాలి. ‘ఓటర్ల జాబితాలో మీరు పేరు ఉందో లేదో కనుక్కోవాలి. 1950 అనే నంబరుకు మీ ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్‌ నంబర్‌ను ఎస్సెమ్మెస్‌ చేయాలి. చేసిన వెంటనే ఓటరు అవునా ... కాదా! అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఓటరు కాకుంటే  ఈ రకంగా ఫామ్‌ –6 సమర్పించాలి. డూప్లికేట్‌ ఓటరు ఎక్కడైనా కనిపిస్తే ఫామ్‌–7 సమర్పించాలి..’ అంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. దేశంలోని ప్రతి బాధ్యతాయుతమైన పౌరుడు ఈ పని చేయాలి. ఓటు హక్కును ప్రజల దగ్గరకు తీసుకువెళ్లే కార్యక్రమం ఇది. అయితే దీనిపై ఎంక్వయిరీ జరక్కూడదని, ఒకవేళ ఎంక్వయిరీ జరిగితే దొంగ ఓట్లను తీసేస్తారని అడ్డుకుంటున్నారు. చంద్రబాబునాయుడుకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇతర ఎల్లో మీడియా... వీళ్లంతా కలసి అదేదో తప్పన్నట్లు చిత్రీకరిస్తున్నారు. 

చంద్రబాబు చేసిందే అసలు తప్పు
దొంగ ఓట్లున్నాయని చెప్పి దర్యాప్తు కోరడం తప్పు కాదు. రెండేళ్లుగా చంద్రబాబు చేసిందే అసలు తప్పు. ప్రజలకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు చంద్రబాబు తీసుకోవడం తప్పు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన ఆధార్‌ కార్డు వివరాలను సేకరించడం తప్పు. సామాన్య ప్రజలకు సంబంధించిన ఓటర్‌ ఐడీ,  కలర్‌ ఫోటోలతో కూడిన మాస్టర్‌ కాపీని తీసుకోవడం అసలు తప్పు. ఇది సైబర్‌ నేరం. ప్రైవేటు వ్యక్తుల వద్దగానీ, ప్రైవేటు సంస్థల వద్దగానీ ప్రజలకు సంబంధించిన డేటా, ఆధార్‌ వివరాలు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, కలర్‌ ఫోటోల సహితంగా ఓటర్ల జాబితా ఉంటే...అది పూర్తిగా నేరం, చట్ట విరుద్ధం అవుతుంది. ఇవి శిక్షార్హమైన నేరాలు. వీటిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అలాంటిది.. ప్రజల వివరాలన్నీ ప్రైవేటు కంపెనీలకు చోరీ చేసి ఇవ్వడం, టీడీపీ యాప్‌ అయిన సేవామిత్రలో వాడుకోవడం, ఇష్టమొచ్చినట్లుగా ఓటర్లను తీసేయడం చేస్తున్నారు.

ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న ఈ వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రిగా ఒక్క క్షణమైనా ఉండటానికి అర్హుడేనా?. ఇవే విషయాలను గవర్నర్‌కు నివేదించాం. ఎన్నికల కమిషన్‌కు కూడా మరోసారి చెబుతాం. వీటిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయమని అడుగుతాం. ఒక ముఖ్యమంత్రి ప్రజల బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు తెలుసుకోవడం, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం, సేవామిత్ర యాప్‌లో పొందు పర్చడం శిక్షార్హమైన నేరాలే. ఇవన్నీ చంద్రబాబు, ఐటీ మంత్రిగా ఆయన కుమారుడు జైలుకు పోవాల్సిన నేరాలే.     వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు తన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫామ్‌–7 సమర్పించడం ఒక తప్పన్నట్లుగా మాట్లాడుతున్నారు. రెండేళ్లుగా ఆయన చేర్పించిన దొంగ ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లు తొలగించండి అని అడగడం తప్పంట. ఆయన అలా చెప్పడం.. ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా అంతా.. డ... డ... డ... అంటూ డప్పు కొట్టడం జరుగుతోంది..’ 

56 లక్షల డూప్లికేట్, డబుల్‌ ఓట్లు గుర్తించాం
ఎన్నికల కమిషన్‌ 2018 సెప్టెంబర్‌లో ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాను మేం పూర్తిగా అధ్యయనం చేశాం. చంద్రబాబు అన్యాయమైన పనులు చేస్తున్నాడనే ఆందోళనతో ఇలా అధ్యయనం చేశాం. గత ఎన్నికల్లో చంద్రబాబుకు, మాకూ వచ్చిన ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే. 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. అందుకే ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో ఆ ఓటర్ల జాబితాను పూర్తిగా అధ్యయనం చేశాం. అందులో రకరకాల పారామీటర్లతో 56 లక్షల డూప్లికేట్, డబుల్‌ ఓట్లు ఉన్నాయని లెక్కలు తేల్చాం. ఒకే ఓటరు ఐడీ కార్డు మీద ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండటాన్ని గుర్తించాం. వయస్సు సంబంధిత అర్హత లేకున్నా ఓట్లు కలిగి ఉండటం (ఓటర్స్‌ ఆఫ్‌ ఇన్‌వ్యాలిడ్‌ ఏజ్‌), ఓటరు పేరు, తండ్రి పేరు, భర్త పేరు, ఇంటి నంబరు, వయçస్సు, లింగం ఒకే విధంగా ఉన్న డూప్లికేటు ఓట్లు గుర్తించాం. అలాగే ఒక వ్యక్తి ఏపీ , తెలంగాణలో ఓట్లు కలిగి ఉండటం.. ఇలా రకరకాలుగా 56 లక్షల డూప్లికేట్, డబుల్‌ ఓటర్లు ఉన్నారని గుర్తించి కోర్టులో కేసు వేశాం. 24 పెన్‌డ్రైవ్‌ల్లో సమాచారం సమర్పించాం.

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. వీటిపై చర్యలు తీసుకుంటారు, దర్యాప్తు చేసి వెరిఫై చేసి సవరిస్తారనుకుంటే అలా జరగలేదు. ఎలాంటి చర్య తీసుకోలేదు. జనవరి 2019 వచ్చే నాటికి ఆశ్చర్యకరమైన రీతిలో ఇలాంటివి మరో 3 లక్షల ఓట్లు పెరిగాయి. ఇలాంటి ఓట్ల సంఖ్య మొత్తం 59 లక్షల 16 వేలకు చేరింది. దీంతో మళ్లీ జనవరిలో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి నేను స్వయంగా వినతిపత్రం సమర్పించా. మళ్లీ వారికి 24 పెన్‌డ్రైవ్‌లలో వివరాలన్నీ ఇచ్చాం. ఈ మేరకు డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారని వారికి అర్థం అయ్యేలా చెప్పాం. టీడీపీ రెండేళ్లుగా ఒక పద్థతి ప్రకారం ఇలా చేస్తున్న విషయం వివరించి వచ్చాం. తర్వాత దానిపై తదుపరి చర్యల్లో భాగంగా ఫామ్‌–7లు కూడా నింపి ఎన్నికల కమిషన్‌కు నివేదించాం.

దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు
డేటా దొంగతనానికి సంబంధించి ఏపీ పోలీసులకు కాకుండా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేయడాన్ని టీడీపీ వాళ్లు విమర్శించడాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఆంధ్రాకు సంబంధించిన వారెవరైనా వచ్చి హైదరాబాద్‌లోని మీ (మీడియా ప్రతినిధి) ఇంట్లో దొంగతనం చేస్తే ఆంధ్రాలో కేసు పెడతావా? లేకుంటే మీ ఇల్లు ఉండే ఎస్సార్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెడతావా? అమెరికాలో ఏదైనా నేరం జరిగితే భారత్‌లో ఎవరైనా కేసు పెడతారా? వారి ఆఫీసు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది కనుక ఎవరైనా ఇక్కడే కేసు పెడతారు..’ అని చెప్పారు.

ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదు
ఇదేదో ఆంధ్రా– తెలంగాణ గొడవ అన్నట్లు చెప్పడం సరికాదని జగన్‌ అన్నారు. చంద్రబాబు తెలంగాణ–ఆంధ్రా మధ్య యుద్ధం అన్నట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టించే, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజల ఆధార్‌ వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకోవడం తప్పని, ఓటర్ల జాబితా మాస్టర్‌ కాపీ తీసుకుని సేవామిత్ర యాప్‌లో పెట్టుకోవడం నేరమని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రే ఇలా చేస్తే రేపు ఎవరికీ భద్రత ఉండదని అన్నారు. ‘ఆధార్‌ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. ఆ వివరాలు ముఖ్యమంత్రి ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదు. మీ బ్యాంకు అకౌంట్‌ వివరాలు ఎవరి వద్దా ఉండకూడదు. మీ అకౌంట్‌లో నుంచి మీ జీతం చంద్రబాబు అకౌంట్‌లోకి వెళితే కూడా ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు..’ అని విపక్ష నేత వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలసి వినతిపత్రం సమర్పించిన వారిలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పీడిక రాజన్నదొర, ఆదిమూలపు సురేష్, పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement