
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దీక్షల పేరిట కొత్త సమస్యలను సృష్టించడం ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం చెప్పడమే అవుతుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దీక్షల పేరిట బీజేపీ డ్రామాలు ఆడటం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చీడలాంటివని చెప్పారు. ఆయన గురువారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా జరగనీయలేదని ప్రధాని అనడాన్ని ఖండిస్తోందన్నారు.
పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం లేకుండా ఏఐఏడీఎంకేతో రచ్చ చేయించింది బీజేపీయేనని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చ జరిగితే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు కారణమయ్యాయో, ఏయే హామీలు ఇచ్చి మోసం చేశాయో అవన్నీ ప్రజలకు తెలిసేవన్నారు. ‘‘రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, వినతిపత్రాలు సమర్పించి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నాలుగేళ్లుగా హోదా అనే మాటకు సమాధి కట్టారు. హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు తానే హీరో అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.