సాక్షి, హైదరాబాద్ : కారు స్పీడ్‌తో ఇప్పటికే చతికిలపడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. బీజేపీలో చేరేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ వివేక్, కల్వకుంట్ల రమ్యరావు భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపై చర్చలు జరిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం లేకపోవడంతో పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చదవండి:(బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ)
కావాలనే నాపై దుష్ప్రచారం: కోమటిరెడ్డి
అయితే ఈ వార్తలను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. బీజేపీ నేత రాంమాధవ్‌తో తాను చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. కావాలనే తనపై దుష‍్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వివేక్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నిన్న మాజీ ఎంపీ వివేక్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని వివేక్ నివాసంలో ఆయనను కలిసిన రేవంత్....రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరాలని వివేక్‌ను రేవంత్ ఆహ్వానించినట్లు సమాచారం.
కాగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కమలనాథుల ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల కీలక నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆర్‌ఎస్‌ఎస్ మాజీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా రాంమాధవ్ హైదరాబాద్ వచ్చి పార్క్ హయత్‌లో మకాం వేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి పలువురు నేతలతో ఆయన సమావేశమయ్యారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాంమాధవ్‌తో టచ్‌లోకి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ ఎంపీలు, టీపీసీసీ వర్గాలు ఖండిస్తున్నాయి. రాంమాధవ్ నేతృత్వంలో ఎవరెవరు బీజేపీలో చేరతారనేది ఒకటెండ్రు రోజుల్లో తేలనుంది. రాంమాధవ్ వ్యూహం ఫలిస్తే.. 2020 చివరినాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment