సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని గ్రహించి నాలుగేళ్ల క్రితమే ఎదురు తిరిగామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని, బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణను పాలించే హక్కు కేసీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని జూపల్లి కృష్ణారావు నివాసానికి లంచ్ మీటింగ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అటు నుంచి పొంగులేటి నివాసానికి రేవంత్, కోమటిరెడ్డి బయల్దేరారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చవద్దని తెలిపారు. తెలంగాణ అమరవీరులు కోరుకున్నది ఇలాంటి సమాజం కాదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారని, బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని, బంగారు తెలంగాణ కొందరికే పరిమితమైందని విమర్శించారు.
ప్రాణ త్యాగాలపై ఏర్పడిన తెలంగాణను ద్రోహులు ఏలుతున్నారని, తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతోందని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించేవారిని పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తనను కాంగ్రెస్‌లో రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
చదవండి: అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం: రేవంత్, కోమటిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment