సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ రిజర్వేషన్లపై అభ్యంతరాలకు కనీసం వారం రోజుల సమయం ఉండేలా ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బీజేపీ ప్రతినిధిబృందం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండగా, 7వ తేదీనే నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం సరిపోదని పేర్కొంది. అనేక మున్సిపాలిటీల్లో వార్డు విభజనల లెక్కల్లో తప్పులు, వార్డులు వారీగా ఓటర్ల జాబితాల్లో, ఎస్సీ,ఎస్టీ,బీసీ జనగణనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త డా.ఎస్.మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్‌జీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మహిళా రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, నిజాంపేట, బడంగ్‌పేట,పెద్దఅంబర్‌పేట తదితర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల్లో తప్పులు వెంటనే సరిదిద్దాలని కోరారు. తాము పేర్కొన్న అంశాలపై నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు.