వైఫల్యాల పాలకులను శిక్షించాలి | BJP calls for the people of the state | Sakshi
Sakshi News home page

వైఫల్యాల పాలకులను శిక్షించాలి

Published Sun, Nov 11 2018 2:30 AM | Last Updated on Sun, Nov 11 2018 2:30 AM

BJP calls for the people of the state - Sakshi

టీఆర్‌ఎస్‌ వైఫల్య పాలనపై బీజేపీ రూపొందించిన ప్రజాచార్జిషీట్‌ను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. చిత్రంలో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగించిన వైఫల్య పాలనకు తగిన శిక్ష వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. నాలుగున్నరేళ్ల కాలంలో కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు, విధ్వంసకర పాలనపై బీజేపీ ప్రజాచార్జిషీట్‌ రూపొందించింది. శనివారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజాచార్జిషీట్‌ విడుదల చేశారు. ఈ 4 పేజీల చార్జిషీట్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలు, నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.

అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కె.చంద్రశేఖర్‌రావు మాట తప్పారని, అప్పట్నుంచి అన్ని హామీలను తుంగలో తొక్కి నిరంకుశంగా పాలించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.  ప్రభు త్వ విభాగాల్లో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నా రు. నాలుగున్నరేళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మిర్చి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న చేతులకు బేడీలు వేసిన దుస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడంతోనే మహిళలపట్ల టీఆర్‌ఎస్‌ వైఖరి స్పష్టమైందన్నారు. బతుకమ్మ చీరల పేరిట రూ.250 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని,    తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ సంతృప్తిగా లేరన్నారు.  

ప్రజా చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు... 
నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని బీజేపీ ప్రజాచార్జిషీట్‌లో పేర్కొంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రకటించిన చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు ఇవీ...  
- భూమిలేని దళిత కుటుంబాలు 5 లక్షలుంటే కేవలం 5 వేల మందికి భూమి ఇచ్చి మిగతావారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది. 
ఎస్సీల అభ్యున్నతికి ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి నాలుగున్నరేళ్లలో రూ.15 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కరీంనగర్‌ జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన దళితులపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి హింసించింది. 
కుమురంభీం పైలాన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం.. పబ్బులు, విదేశీ షాపింగ్‌ మాల్స్‌ను మాత్రమే తెరిచింది. రాజ్యాంగబద్ధంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాల్సి ఉండగా, మతపరమైన రిజర్వేషన్లతో ముడిపెట్టి ఎస్టీలను మోసం చేసింది. గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు రూ.10 వేల కోట్ల వడ్డీలేని రుణాలిస్తామని చెప్పి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసింది. పేద, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీకి అతీగతీ లేదు. జిల్లాకొక గిరిజన భవన్‌ పత్తాలేకుండా పోయింది. 
బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పింది. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు నిధులివ్వకుండా దివాలా తీయించింది. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్‌లంటూ అంటకత్తెర పెట్టింది. సమగ్ర కుటుంబ సర్వే పేరిట పరుగులెత్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలను ఎక్కడా ఉపయోగించుకోలేదు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి ప్రజల గొంతును పూర్తిగా నొక్కేసింది. 
రాజకీయ లాభం కోసం 31 జిల్లాలు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వరంగసంస్థల్లో 2.7 లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉంటే 34 వేల ఉద్యోగాలే భర్తీ చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 20 వేల ఉపాధ్యాయ ఖాళీలుంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేదు.  
ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు రూ.400 కోట్ల గ్రాంటు ప్రకటించి కేవలం రూ.50 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాకొక ఇంజనీరింగ్‌ కాలేజీ, నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ, మండలానికి ఒక ఐటీఐ అని చెప్పి.. నడుస్తున్న కాలేజీలను మూసేసింది. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా విద్యార్థులను అష్టకష్టాలకు గురిచేసింది. కేజీ టు పీజీ విద్యా పథకం పత్తా లేకుండా పోయింది. మైనింగ్‌ యూనివర్సిటీ ఊసేలేదు. 
హైదరాబాద్‌లో ఒకే సంవత్సరంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పి నగర ప్రజలను మోసం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఒక శాతం కూడా నిర్మించలేదు. 
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 1,200 మంది అమరులైతే కేవలం 450 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చింది. జిల్లాకొక అమరుల స్తూపం, సొంత ఇళ్లు కట్టించకుండా ప్రగతిభవన్‌ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసింది. అమరుల కుటుంబాలకు మాత్రం అన్యాయం చేసింది. మిషన్‌ కాకతీయ కింద రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఆయకట్టుకు నీరురాలేదు. మిషన్‌ భగీరథ అవినీతిలో కూరుకుపోయింది. కొండగట్టు అభివృద్ధి సంగతే మోగానీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులను కనీసం పరామర్శించలేదు.  
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోగుల తాకిడిని నియంత్రించి హైదరాబాద్‌ చుట్టూ 4 ఆస్పత్రులు కట్టిస్తానని మోసం చేసింది. జిల్లాకొక నిమ్స్, నియోజకవర్గానికో వంద పడకల ఆస్పత్రి ఊసేలేదు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రవేశపెట్ట కుండా అడ్డుకోవడంతో పేదలు నష్టపోయారు.  
స్వచ్ఛభారత్‌ కింద రూ.వేల కోట్లు నిధులిచ్చినా రాష్ట్రంలో ఎక్కడా స్వచ్ఛత లేదు. మెట్రోరైలు శంషాబాద్‌ వరకు పొడిగిస్తానని చెప్పి ఎంజీబీఎస్‌ దాటించలేదు.  
విద్యుత్‌ కొనుగోలులో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది.  
ఫసల్‌ బీమా యోజన  ను నిర్లక్ష్యం చేసింది. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేసింది. వరంగల్‌ అభివృద్ధి, సింగరేణి కాలరీస్‌లో నిమ్స్‌ ఏర్పాటు కలగానే మిగిలిపోయాయి.  
అన్ని సామాజిక వర్గాలకు భవనాలు నిర్మిస్తామని చెప్పి ఒక్కటి కూడా నిర్మించలేదు.  
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను కూడా రద్దు చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement