బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
సాక్షి, భువనగిరి(యాదాద్రి): లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తెలంగాణలో యుద్ధం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. ‘మార్పు కోసం బీజేపీ జన చైతన్య యాత్ర’లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు టీఆర్‌ఎస్‌తో తలపడే దమ్ములేదన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధి వద్ద నివాళులు అర్పించలేని వాళ్లు ఇక ప్రతిపక్షం పాత్ర ఎలా వహిస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమవుతోందనీ, సుపరిపాలన ఎక్కడా కానరావడం లేదని విమర్శించారు.
తెలంగాణలో కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. కమీషన్‌ల కోసమే మిషన్ పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, టీఆర్‌ఎస్ గద్దెనెక్కి పాలిస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్దిని చూసి దేశం గర్విస్తోందని చెప్పకుంటున్న కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్‌రూం ఇంటినైనా నిర్మించారా అని మురళీధర్‌రావు ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ అభివృద్ది జరిగినప్పుడు రైతు ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని కులాలు, మతాలను కలుపుకొని పోయేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment