
సాక్షి, హైదరాబాద్ : కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో గోక్కోవడమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం లక్ష్మణ్ సమక్షంలో డాక్టర్ పద్మతో పాటు పలువురు డాక్టర్లు, ఫ్రొఫెసర్లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో మునగడానికి ప్రభుత్వం చేసున్న విదానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఇది ప్రజా రవాణా సంస్థపై పన్నుల భారం మోపుతుందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ! ఇక మీ పతనం ప్రారంభమైంది, ప్రజలు మీ పాలనను గమనిస్తున్నారంటూ మండిపడ్డారు.