సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం పుట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. కన్నాకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై కినుక వహించిన సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కన్నాతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తారని భావించినప్పటికీ.. పార్టీ నేతలకు వీర్రాజు అందుబాటులో లేరని సమాచారం. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం పార్టీలో కలకలం రేపుతోంది. మరోవైపు ఆయన వర్గం నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. సోము వీర్రాజుకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రూరల్, అర్బన్ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం కావడం.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడం తదితర పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా హరిబాబు వైదొలగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎన్నికల కన్వీనర్‌గా సోము వీర్రాజును బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే, మొదటినుంచి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరఫున దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజుకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పార్టీ అధినాయకత్వం కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. అయితే, పార్టీ మారేందుకు సిద్ధపడిన కన్నా లక్ష్మీనారాయణను బుజ్జగించేందుకు ఆయనకు అధ్యక్ష పదవి అప్పగించినట్టు సోము వీర్రాజు వర్గీయులు భావిస్తున్నారు. తమ నేతకు కాకుండా పార్టీ మారేందుకు సిద్ధపడిన కన్నాకు ఎలా పదవి అప్పగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ నేతకు చివరినిమిషంలో పదవి ఇవ్వకుండా అవమానించారని వీర్రాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment