విజయవాడ, అనంతపురం: కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటూ ప్రచారం చేయబోయిన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్‌బాబుకు కర్ణాటకలో ఏం పని అని నిలదీశారు. ఉద్యోగ పదోన్నతి కోసం దొంగ సర్టిఫికెట్లు తయారుచేయించిన వ్యక్తి అశోక్‌బాబు అని విమర్శించారు.
అశోక్‌బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి..!
‘కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ లక్ష్మీపతిరాజా అన్నారు. బెంగళూరులో టీడీపీ నిర్వహించిన తెలుగు సంఘాల సమావేశంలో అశోకబాబు పాల్గొని బీజేపిని ఓడించి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నాయకుడా? లేదంటే టీడీపీ అధికార ప్రతినిధా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ ఇటీవల రాయలసీమ పర్యటన సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రచారం చేస్తామని అశోకబాబు ప్రకటించారు. ఇది ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకుని.. విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చెయ్యాలి. ఉద్యోగ సంఘాలు అశోక్ బాబుని అధ్యక్షుడిగా తొలగించాలి. ఆయన తీరుపై రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తాం. ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుంది. కర్ణాటకలోని తెలుగు ప్రజలు టీడీపీ అసత్య ప్రచారాలు నమ్మబోరు’ అని ఆయన అన్నారు.
అనంతపురం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని.. ఆ పార్టీకి అనుకూలంగా అశోక్‌బాబు పనిచేస్తున్నారని, ఆయనను వెంటనే ఉద్యోగంలోంచి తీసివేయాలని అన్నారు. అశోక్‌బాబు నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. కర్ణాటకలో ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రమోషన్ కోసం దొంగ సర్టిఫికెట్లు తయారుచేయించిన వ్యక్తి అశోక్‌బాబు అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment