సాక్షి, బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో హీనస్థాయి రాజకీయాలు చేయబోయిన తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. టీడీపీ ప్రోదర్బలంతో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం బెంగళూరులో తెలుగు సంఘాలతో జరిపిన సమావేశం రసాభసకు దారితీసింది. ‘‘ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా, స్థానిక సమస్యలపై నోరుమెదపకుండా.. ఇక్కడికి(కర్ణాటకకు) వచ్చి మీరు చెప్పదల్చుకున్నది ఏంటి?’ అని నిలదీతలు ఎదురయ్యాయి.
అసలేం జరిగింది?: ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరుతో అశోక్ బాబు బృందం బెంగళూరులో నిర్వహించిన సమావేశానికి కర్ణాటకలోని పలు తెలుగు సంఘాలను ఆహ్వానించారు. ఏపీకి అన్యాయం చేసినందున కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాటలనే అశోక్‌బాబు వల్లెవేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ‘అదేంటిసార్, ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి గెలిపించమని కోరడం ఎంతవరకు సమంజసం?’’ అని కొన్ని సంఘాలు నిలదీశాయి. ‘ప్రత్యేక హోదా ఉద్యమంలో మారు మాట్లాడని మీరు ఇక్కడికొచ్చి చెప్పేది ఇదేనా?’’ అని ప్రశ్నించారు.
తెలుగు పేరుతో టీడీపీ సమావేశమేంటి?: సమావేశం జరిగిన తీరును నిరసిస్తూ పలు తెలుగు సంఘాలు గళం విప్పాయి. ‘‘తెలుగు సంఘాల పేరుతో టీడీపీ సమావేశం నిర్వహించడమేంటి? ఒకవేళ ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే మేము ఇక్కడికి వచ్చేవాళ్లమేకాదు. అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడని ఉద్యోగ సంఘాలు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పడానికి వచ్చారు? అశోక్ బాబును చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. కానీ మమ్మల్ని బయటికి గెంటేశారు. ఆహ్వానించి ఇలా చేయడం ఎంతవరకు సబబు?’’ అని కర్ణాటకలోని తెలుగు యువకులు వాపోయారు.
టీడీపీతొ పొత్తువల్లే బీజేపీ బతికింది: సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ఇజంకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతలకు చెక్ పెట్టడమంటే ఓడించడమే. అసలు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ బతికిపోయింది.’’ అని అన్నారు. ‘నాలుగేళ్లు టీడీపీ-బీజేపీ కలిసే ఉందికదా, మరి ఏపీలో కాలయాపన చేశారెందుకు?’ అన్న మీడియా ప్రశ్నకు అశోక్ బాబు పొంతనలేని సమాధానమిచ్చారు. ‘‘10 ఏళ్లు టైముందని, ఆరాటం వద్దని బీజేపీ వాళ్లే చెప్పారు. కాబట్టే ఏపీ హక్కుల విషయంలో మేం మౌనంగా ఉన్నాం. అయినా హక్కుల పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు’’ అని అశోక్ బాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment