బెంగళూరు: మరో మూడు రోజుల్లో పోలింగ్ జరుగనున్న వేళ.. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టలకొద్దీ ఓటర్ ఐడీ కార్డులు బయటపడిన వ్యవహారం కర్ణాటకలో కలకలానికి దారితీసింది. కొత్త ఓటర్ల ముసుగులో భారీ స్థాయిలో చీకటి వ్యవహారం నడుస్తున్నట్లు వెల్లడికావడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు.
అధికారులు షాక్: వేగుల సమాచంమేరకు ఉత్తర బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై అధికారులు దాడిచేయగా.. వేలకొద్దీ ఓటర్ ఓటర్ ఐడీకార్డులు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్ లభ్యమయ్యాయి. అక్కడున్న సరంజామా చూసి అధికారులు సైతం షాకయ్యారు. సదరు ఐడీ కార్డులన్నీ బెంగళూరు రూరల్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్(ఆర్‌ఆర్ నగర్) నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా అధికారులు గుర్తించారు. ఇటీవల సవరించిన జాబితాలో.. ఈ నియోజకవర్గంలో కొత్తగా 10.3 శాతం ఓటర్లు చేరారు. దీంతో మొత్తం వ్యవహారంలో కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 24 గంటల్లోగా విచారణపూర్తిచేసి అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్ కుమార్ మీడియాకు చెప్పారు.
ఎన్నికను నిలిపేయాలి: అపార్ట్‌మెంట్‌లో ఓటర్ కార్డు గుట్టల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలు మిన్నంటుతున్నాయి. కుట్రలో సూత్రధారులు, పాత్రధారులు అంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లేనని బీజేపీ ఆరోపిస్తున్నది. కేంద్ర మంత్రి అనంత కుమార్ మరో అడుగుముందుకేసి ఆర్‌ఆర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికను నిలిపేయాలని ఈసీని డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ఆర్‌ఆర్ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, ఓటర్ ఐడీ కార్డుల వ్యవహారంలో తమ నేతల ప్రమేయం లేదని కాంగ్రెస్ వివరించింది. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని, ఎన్నికల్లో ఓటమి భయం వల్లే చీప్ పాటిటిక్స్ ప్లే చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment