సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సేవ్ బెంగళూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలో సీఎం సిద్ధరామయ్య ప్రభావాన్ని తగ్గించేలా కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా సేవ్ బెంగళూర్‌కు రూపకల్పన చేశారు. గత కొద్దిరోజులుగా బెంగళూర్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తూ రోడ్లు, ఫ్లైఓవర్లను ప్రారంభిస్తూ హడావిడి చేస్తున్న సీఎం సిద్ధరామయ్యకు కౌంటర్‌గా బీజేపీ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సంసిద్ధమైంది.
బెంగళూర్‌లో నమ్మ మెట్రో, రహదారుల నిర్మాణం, అదనపు బస్సుల ద్వారా ప్రజా రవాణాను మెరుగుపరచడం వంటి అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందని సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేస్తున్న క్రమంలో దీన్ని దీటుగా తిప్పికొట్టేందుకు బీజేపీ సేవ్ బెంగళూర్ పేరిట కార్యాచరణకు దిగింది. కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, డీవీ సదానందగౌడ, ప్రకాష్ జవదేకర్‌ల నేతృత్వంలో బసవనగుడి నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు.
నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో యాత్ర సాగేలా బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేశాయి. బెంగళూర్ సిటీలో 28 అసెంబ్లీ స్ధానాలుండగా గత వీటిలో 13 స్ధానాల్లో కాంగ్రెస్, 12 స్ధానాల్లో బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని అత్యధిక నియోజకవర్గాలను దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తలపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment