సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురంలో కియా సంస్థను కేంద్రం ఏర్పాటు చేస్తే.. అది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నాడు.. అబద్ధాలు చెప్పడం, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం మూలంగా ఏపీలో అభివృద్ధి జరిగిందని, ఏపీలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు వెళ్లకుండా కొత్త వివాదాలు లేవనెత్తారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. యూటర్న్‌లు ఎక్కువగా తీసుకున్న పేరు బాబుకి దక్కిందని, వివాదాలు నిర్మాణం చేయడంలో బాబు దిట్టని విమర్శించారు. బాబు తిరోగమనం వైపు పయనిస్తున్నారని, ఈ ఐదేళ్లలో ఆయన తీరు బాధాకరమన్నారు. ఎలక్షన్‌పై ఆయన మాటలు.. ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయన్నారు.
ఎన్నికలు అనేవి ఎలక్షన్ కమిషన్ జరిపిస్తుందా లేక తన ప్రభుత్వం జరిపిస్తుందా అని ప్రశ్నించారు. 2014 కంటే 2019లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అయిందని వెల్లడించారు. చంద్రబాబు ఏపీని అవినీతి, తిరోగమనం వైపు విచ్చలవిడిగా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి జరిగిందని అంటున్న బాబు ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో చెప్తే బాగుంటుందన్నారు. ఏపీ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ వల్ల జరిగిందని, అది బాబు గారు చెప్పరని అన్నారు. మోదీ వల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని తెలిపారు. అవినీతిని కింది స్థాయి వరకు సీఎం చంద్రబాబు తీసుకెళ్లారని, ఇసుకపై 16 వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment