సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడుకు మరోసారి ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి 40 ఏళ్లు వెనక్కి వెళ్తుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మించకుండా గ్రాఫిక్స్ మాయాజాలంతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులన్నీ మింగేశారని ఆరోపించారు. ఎక్కడిక్కడ ఇసుక తవ్వేసి 40 వేల కోట్ల రూపాయలు దోచేశారని విమర్శలు గుప్పించారు. అందుకే గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ఇసుక దందాపై రూ. 100 కోట్లు ఫైన్ వేసిందన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏపీని అధోగతి పాలు చేస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి ఎవరినైనా బహిష్కరించాల్సి వస్తే ముందుగా చంద్రబాబునే బహిష్కరించాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలన్నింటీ మేనేజ్ చేయగల ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు.. అవినీతి చేసే వాళ్లే సీబీఎన్ ఆర్మీ మెంబర్స్ అంటూ విమర్శించారు.
అన్నింటికీ పవనే కారణం..
ప్రశ్నిస్తానని వచ్చిన నాయకుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం తానే ఒక ప్రశ్నగా మిగిలిపోయాడని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. 2014లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దాం అంటే ఒప్పుకోని పవన్ టీడీపీ మద్దతు పలికారన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. పథకం ప్రకారమే పవన్ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.. కొందరికి కొమ్ముకాసే వ్యక్తిగా ఆయన మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితికి పవనే కారణమని.. ఆయన కారణంగానే సామాజిక వర్గాల ఐక్యత విచ్ఛిన్నం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment