
సాక్షి, ఉట్నూర్ : ఆదిలాబాద్ ఎకంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లోకి అటవీశాఖ అధికారులు వస్తే తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఉట్నూర్ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన హక్కులపై ఆయన మాట్లాడుతూ...‘హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకోం. అటవీ అధికారులు గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లోకి అధికారులు వస్తే కట్టెలతో దాడి చేయండి. పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయండి.’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే గిరిజనుల హక్కుల డిసెంబర్ 9న ఢిల్లీలో ధర్నాకు ఎంపీ పిలుపునిచ్చారు.
కాగా ఇటీవలే కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సర్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, తన అనుచరులతో కలిసి మహిళా ఎఫ్‌ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment