
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్య మంత్రి ఇంటి కుక్కకు ఉన్న విలువ తెలంగాణ కోసం బలిదానం చేసిన వారికి లేదా? అని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. అంత విలువ ఇచ్చేవారైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కారులో మజ్లిస్ సవారీ చేస్తోందన్నారు. కారు రిమోట్ మజ్లిస్ చేతుల్లో ఉందని స్టీరింగ్ మాత్రం కేసీఆర్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని 20 ఏళ్లుగా బీజేపీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో నిజాం పాలన నడుస్తోందని, రాచరిక వ్యవస్థను తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment