న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ అగ్ర నాయకుడు ఎల్కే అడ్వాణీ స్థానంలో గాంధీనగర్‌లో పోటీచేయబోతున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా బీజేపీ బుధవారం 184 మంది అభ్యర్థులతో గురువారం తొలి జాబితాను విడుదలచేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్(28), మహారాష్ట్ర(16), తెలంగాణ(10), పశ్చిమ బెంగాల్(28), అస్సాం(8), ఉత్తరాఖండ్(5), తమిళనాడు(5), ఛత్తీస్‌గఢ్(5), జమ్మూ కశ్మీర్(5), కర్ణాటక(21), కేరళ(13), ఒడిశా(10), రాజస్తాన్(16), తమిళనాడు(5), అరుణాచల్ ప్రదేశ్(2), ఆంధ్రప్రదేశ్(2) తదితర రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢీకొనబోతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్(పశ్చిమ)లో పోటీచేయబోతున్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్(ఘజియాబాద్), మహేశ్ శర్మ(గౌతమబుద్ధనగర్–నోయిడా)లు తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకున్నారు. బిహార్‌లోనూ 17 మంది అభ్యర్థులను ఖరారుచేసిన బీజేపీ ఆ జాబితాను రాష్ట్ర యూనిట్‌కు పంపింది. మిత్రపక్షాలతో కలిసి అందులోని పేర్లను వెల్లడిస్తామని నడ్డా చెప్పారు. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మంది సిట్టింగ్‌లను తప్పించే అవకాశాలున్నాయి.
ముఖ్యాంశాలు
► క్రిష్ణరాజ్(షాజహాన్‌పూర్) మినహా లోక్‌సభ ఎంపీలైన దాదాపు అందరు కేంద్ర మంత్రులకు టికెట్లు దక్కాయి
► యూపీలో ప్రకటించిన 28 మందిలో ఆరుగురు సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. అందులో ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆగ్రా ఎంపీ రామ్‌శంకర్ కఠారియా, క్రిష్ణరాజ్ ఉన్నారు.
► మాజీ కేంద్ర మంత్రి బీసీ ఖండూరి(గార్వాల్), ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కోషియారి(నైనిటాల్)ల స్థానంలో కొత్తవారికి చోటు కల్పించారు.
► ఇటీవలే మిజోరం గవర్నర్‌గా వైదొలిగిన కుమ్మనం రాజశేఖరన్‌కు కేరళలోని తిరువనంతపురం టికెట్ కేటాయించారు.
► తమిళనాడు యూనిట్ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళితో పోటీపడనున్నారు.
► మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్‌కు అహ్మద్‌నగర్ టికెట్ దక్కింది. ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు.
► మహారాష్ట్రలో వారసత్వ రాజకీయ నేపథ్యమున్న పూనమ్ మహాజన్(ప్రమోద్ మహాజన్ కూతురు), ప్రీతమ్ ముండే(గోపీనాథ్ ముండే కూతురు), రక్షా ఖడ్సే(ఏక్‌నాథ్ ఖడ్సే కోడలు)లకు జాబితాలో చోటు దక్కింది.
మరోసారి రాహుల్ వర్సెస్ స్మృతి
అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్య మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో రాహుల్ చేతిలో స్మృతి లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశారు. మరోవైపు, ముంబై నార్త్ సెంట్రల్‌లో పూనమ్ మహాజన్(బీజేపీ), సంజయ్ దత్ సోదరి ప్రియాదత్(కాంగ్రెస్)ల మధ్య ఇలాంటి పోరే జరిగే అవకాశాలున్నాయి. క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాదత్‌ను పూనమ్ మహాజన్ ఓడించారు.
అడ్వాణీ రాజకీయ జీవితానికి తెర!
బీజేపీ తొలి జాబితాలో 91 ఏళ్ల కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అడ్వాణీ పేరును విస్మరించడం ఆశ్చర్యపరిచింది. గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన స్థానంలో పోటీచేస్తున్న అమిత్ షా తొలిసారి లోక్‌సభ బరిలో దిగబోతున్నారు. దీంతో అడ్వాణీ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని భావిస్తున్నారు. 1998 నుంచి అడ్వాణీ గాంధీనగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తొలినాళ్లలో ఆయనకు అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ప్రస్తుతం కూడా గాంధీనగర్ ఎంపీగా ఉన్న అడ్వాణీ ఆ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు.
2014లో మోదీ–షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అడ్వాణీ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ లోక్‌సభలో 92 శాతం పార్లమెంట్ సమావేశాలకు హాజరైనా ఆయన మాట్లాడింది కేవలం 350 పదాలే. అడ్వాణీకి సీటు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ స్పందిస్తూ..అగ్ర నేతను తొలుత బలవంతంగా మార్గదర్శన్ మండలికి పంపిన బీజేపీ ఇప్పుడు ఆయన నుంచి గాంధీనగర్ స్థానాన్ని లాగేసుకుందని ఎద్దేవా చేసింది. 75 ఏళ్లు నిండిన నాయకులను ఇప్పటికే ప్రభుత్వానికి దూరంగా పెట్టిన బీజేపీ ఇక వారిని పోటీయుత రాజకీయాల నుంచి కూడా తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మోదీ మళ్లీ వారణాసి నుంచే
Published Fri, Mar 22 2019 3:27 AM | Last Updated on Fri, Mar 22 2019 10:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment