సాక్షి, హైదరాబాద్ : పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా నాలుగేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షణ్ మీడియా సమావేశంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు పాలనలో చేయలేనిది.. నాలుగేళ్లలో ఏన్డీఏ ప్రభుత్వం సాధించిందని అభివర్ణించారు. జవాబుదారీతనంగా మోదీ పాలన సాగిందని.. కానీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రతిపక్షాలు తప్పుదోవపట్టించాయని మండిపడ్డారు. అయినప్పటికీ ప్రధాని ఎక్కడా వెనక్కి తగ్గలేదని స్పష్టంచేశారు.
గత ప్రభుత్వాల పాలనలో కనీసం మరుగుదొడ్లు నిర్మించలేదని, కానీ మహిళల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మోదీ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తాను అనుభవించిన కటిక పేదరికం ఎవరు అనుభవించకూడదనే పేదలకు అనేక పథకాలు మోదీ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అమ్మాయి పుడితే పురిట్లోనే చంపే ఈ రోజుల్లో అమ్మాయిల సంక్షేమమే ధ్యేయంగా సుకన్య సమృద్ధి యోజన తీసుకొచ్చారని లక్ష్మణ్ గుర్తుచేశారు.
ఈ నాలుగేళ్లలో మోదీ రెండు వందలకు పైగా పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడే హక్కే లేదని, అదే ఏన్డీఏ ప్రభుత్వం దళితుడిని రాష్ట్రపతి చేసిందని గుర్తుచేశారు. ఇక తెలంగాణలో కుటుంబ, నియంతృత్వ పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానంటూ చెప్పిన కే. చంద్రశేఖర్ రావు ఆ తరువాత మాటతప్పారని, మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించని ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవచేశారు.
Comments
Please login to add a commentAdd a comment