మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ నేతలు
సాక్షి, తిరుపతి : మోసపూరిత హామీలతో ప్రజలను మభ్య పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రంపై విమర్శలు గుప్పించటం విడ్డూరంగా ఉందని ఏపీ బీజేపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి విధానాలను ఎండగడుతూ ‘సత్యమేవ జయతే’ పేరిట బీజేపీ తిరుపతిలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, రాష్ట్ర కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాజధాని కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా... చంద్రబాబు మాత్రం తాత్కాలిక భవనమే కట్టారన్నరు. నిధులను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు. గుంటూరులో అతిసారతో ప్రజలు చనిపోవటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆయన ఆక్షేపించారు. చంద్రబాబు ధర్మ పోరాట సభలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని డిమాండ్ చేశారు.
పోలవరానికి పునాది వేసింది వైఎస్సార్
సోమవారం పోలవారంగా ప్రకటించిన చంద్రబాబుకి పోలవరంపై మాట్లాడే అర్హతే లేదని వారు అభిప్రాయపడ్డారు. పోలవరంకు పునాది వేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ.. ఏనాడూ కూడా పోలవరంపై మాట్లాడలేదని విమర్శించారు.
మోదీ వీడియోలు మార్ఫింగ్ : ఎమ్మెల్సీ మాధవ్
తిరుపతి సభలో ప్రధాని నరేంద్ర మోదీ హోదా గురించి అసలు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. నెల్లూరు సభలో చెప్పినట్టుగానే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారన్నారు. ప్రధాని మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి మరీ చంద్రబాబు చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ఆయన నిలదీశారు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి.. తనకు రక్షణ ఇవ్వమని ప్రజలను కోరటం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఇచ్చిన హామీలు నేరవేర్చాము అని సభ పెడితే బాగుండేది.. కానీ పక్కవారిపై బురద చల్లడానికి సభ పెట్టడం ఏంటో అర్ధం కావడం లేదు. బీజేపీ తరపున చంద్రబాబుకి పది ప్రశ్నలు సందిస్తున్నాం. వాటికి కచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి’ అని మాధవ్ డిమాండ్ చేశారు.
చంద్రబాబుకి బీజేపీ సంధించిన పది ప్రశ్నలు ఇవే:
1.పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం నమ్మక ద్రోహమా?
2. హోదా లేని రాష్ట్రానికి ప్యాకేజీ కింద 16వేల కోట్లు ఇచ్చిన మీరు తీసుకోకపోవడం నిజం కాదా?
3. రెవెన్యూ లోటులో టీడీపీ వాగ్దానాలు కలపడం నిజం కాదా?
4. హోదా తప్ప అన్నీ హామీలు కేంద్రం అమలు చేసింది నిజం కాదా?
5. డీపీఆర్ లేకుండా రాజధాని కోసం 1500కోట్లు ఇచ్చి మరో వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పలేదా?
6. పది సంవత్సరాల్లో ఏర్పాటు చేయాల్సిన 11 విద్యా సంస్థలను నాలుగేళ్లలో ఏర్పాటు చేసింది నిజం కాదా?
7. చట్టంలో లేని విద్యా సంస్థలు, రక్షణ శాఖ ప్రాజెక్టులు ఇవ్వడం వాస్తవం కాదా?
8. రాష్ట్రంలో 24 విద్యుత్ సరఫరా చేయడం, పెట్రోలియం, నౌకయాన శాఖ ప్రాజెక్టు వంటి వాటికి నిధులు ఇవ్వడం నమ్మకద్రోహమా?
9. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా గ్రాంట్లు మంజూరు చేయడం నమ్మక ద్రోహమా?
10. నాలుగు స్మార్ట్ సీటీలు, 33 అమృత నగరాలు ఇచ్చి మరీ అభివృద్ది చేయడం మేం చేసిన ద్రోహమా?
Comments
Please login to add a commentAdd a comment