సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్.. గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ భేటీకి సంబంధించిన ఫొటోను అరవింద్ స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే షకీల్ తనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చిన ఫోటోను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అరవింద్ షేర్ చేశారు. ‘టీఆర్‌ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఈ రోజు నా నివాసానికి వచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు నిజామాబాద్ జిల్లా రాజకీయాలపైనా విస్తృతంగా చర్చించాం’అని ట్విట్టర్‌లో అరవింద్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 17న అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో షకీల్ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షకీల్ కూడా తన ఆవేదనను కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లు సమాచారం. ‘టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఆత్మాభిమానం చంపుకుని బతకలేను. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేనైనా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎంఐఎం నేతల సూచనలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ అధిష్టానం నడుచుకుంటోంది. బోధన్ నుంచి మూడు పర్యాయాలు పోటీ చేసి రెండు సార్లు గెలుపొందా. కీలక సమయంలో పార్టీ వెంట నడిచా. జిల్లాలో రాజకీయ దిగ్గజం సుదర్శన్‌రెడ్డిని ఓడించినా నాకు గుర్తింపు దక్కలేదు’అని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. బీజేపీలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఏదైనా ఉంటుందని ఆయన చెప్పినట్టు తెలిసింది. సోమవారం మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నట్టు సమాచారం. ఎంపీ అరవింద్‌తో భేటీ, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో షకీల్ చేరిక ఖాయమైనట్లుగానే తెలుస్తోంది.
పార్టీ పరిణామాలపై కేసీఆర్ దృష్టి..?
పార్టీలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లోతుగా దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాల వారీగా పార్టీ నేతల కదలికలు, మనోగతం తదితరాలపై ఆరా తీస్తూ.. అసమ్మతికి దారితీస్తున్న పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలవారీగా పార్టీలో ఉన్న కీలక నేతలు, వారి నేపథ్యం, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి, పదవులు ఆశిస్తున్న వారు తదితర కోణాల్లో సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే బాధ్యతను అనునిత్యం తనతో ఉండే కీలక నేతకు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఇటీవలి కాలంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల్లో కొందరితో సీఎం కేసీఆర్ మాట్లాడగా.. మరికొందరిని పిలిపించి కారణాలు తెలుసుకునే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌తో సీఎం కేసీఆర్ ఈనెల 8న ప్రగతిభవన్‌లో సుమారు అరగంట పాటు భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులకు కీలక పదవులు ఇస్తామంటూ ప్రకటించడం ద్వారా అసమ్మతికి మొదట్లో చెక్ పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నించారు.అసమ్మతిస్వరం వినిపిస్తున్న నేతలతో పాటు పదవులు ఆశిస్తున్న నేతలు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే జిల్లాలవారీగా పలువురు కీలక నేతలకు ఫోన్లు చేసి తనను కలవాలని కేటీఆర్ ఆదేశిస్తున్నట్టు సమాచారం.
ఇకపై నో చిట్ చాట్..!
తెలంగాణ భవన్, అసెంబ్లీ లాబీల్లో తమకు ఎదురవుతున్న మీడియాతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెడుతుండటంతో ఇకపై ‘చిట్ చాట్’కు దూరంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి తదితరులు అసెంబ్లీ లాబీలో చేసిన వ్యాఖ్యలు మీడియాలో రావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
కేసీఆర్ నా గాడ్‌ఫాదర్: షకీల్
సీఎం కేసీఆర్ తన పొలిటికల్ గాడ్ ఫాదర్ అని, ఆయన ఆశీస్సులతోనే రెండు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైనట్లు షకీల్ పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. గురువారం రాత్రి ప్రగతిభవన్ లో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో షకీల్ భేటీ అయ్యారు. అనంతరం తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం బోధన్‌కు మంజూరు చేసిన రూరల్ అర్బన్ స్కీమ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను ఆయన నివాసంలో కలిశాను. మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాం. దీనిపై టీవీ, సోషల్ మీడియాలో నేను పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది’’అని షకీల్ అందులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment