బొడిగె శోభకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానిస్తున్న లక్ష్మణ్. చిత్రంలో బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు, దేవరకొండకు చెందిన లాలునాయక్ గురువారం బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో వారు తమ అనుచరులతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలకు టీఆర్‌ఎస్ చేస్తున్న మోసానికి శోభకు జరిగిన అన్యాయమే నిదర్శనమని చెప్పారు. చొప్పదండిలో ఆమె చేస్తున్న సేవలపై అసూయ చెందిన టీఆర్‌ఎస్ ఆమెను పక్కన పెట్టిందని విమర్శించారు.
ప్రజలు, కులసంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. దేవాలయాల భూములను స్వాహా చేసిన వారికి అండగా ఉంటోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారంటే వారికి ఎన్ని మూటలు ముట్టజెప్పారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ ఏం చెప్పినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు.
చంద్రబాబు చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్..
తెలంగాణను అడ్డుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ఉండటం దారుణమన్నారు. హెరాల్డ్ కేసులో బెయిల్ మీద బయట తిరుగుతున్న నాయకుల కల నెరవేరదని చెప్పారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ గడ్డం పెంచినంత మాత్రాన అధికారంలోకి రారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలలో ఎవరు గెలిచినా ఎన్నికల తర్వాత వారు టీఆర్‌ఎస్‌లోకే వెళ్తారని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమానికి పాటు పడే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అవినీతి బాగోతం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. అవినీతికి కారణమైన వారిని జైలుకు పంపిస్తామన్న కేసీఆర్ ఎందుకు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారని ప్రశ్నించారు.
టికెట్ రాకుండా అడ్డుకుంది వారే: శోభ
70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచి చూశానని.. టీఆర్‌ఎస్ చేసిన సర్వేలు తనకు అనుకూలంగా వచ్చినా టికెట్ ఇవ్వలేదని బొడిగే శోభ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌లో పూర్తి స్థాయిలో పనిచేశానన్నారు. ఆ పార్టీ నేతలు కవిత, కేటీఆర్, వినోద్‌కుమార్, కేకేలను కలసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఒక ఉద్యమకారిణిగా ప్రగతి భవన్‌లో అడుగుపెట్ట లేకపోయానని.. కేసీఆర్ బంధువులు రవీందర్‌రావు, సంతోష్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు.
119 స్థానాల్లో ఒక దళిత బిడ్డ అయిన తనకే అన్యాయం చేశారని విమర్శించారు. దీనిపై దళిత జాతి మొత్తం ఆలోచించుకోవాలని.. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment