‘రాజనర్తకి’లా జేసీ దివాకర్‌ | Botsa Satyanarayana Comments on JC Divakar Reddy | Sakshi
Sakshi News home page

‘రాజనర్తకి’లా జేసీ దివాకర్‌

Published Thu, May 31 2018 3:03 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

Botsa Satyanarayana Comments on JC Divakar Reddy - Sakshi

వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బూరెల దుర్గ ప్రమాణ స్వీకార సభలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి బ్యూరో:  మహానాడులో సీఎం చంద్రబాబును మెప్పించేందుకు టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి పడినపాట్లు చూస్తుంటే ఆ రోజుల్లో రాజులను మైమరపించే ‘రాజనర్తకి’లా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దివాకర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటే చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం సిగ్గుచేటన్నారు.

గుంటూరులోని కేకేఆర్‌ కల్యాణమండపంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా యువజన అధ్యక్షుడు బూరెల దుర్గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దివాకర్‌రెడ్డికి వయస్సు పెరిగిందే కాని బుద్ధి పెరగలేదన్నారు. గతంలో తాడిపత్రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పోటీ పెట్టలేని దుస్థితిలో హైదరాబాద్‌కు పారిపోయి వస్తే డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పోటీకి నిలిపి గెలిపించిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. 

దోపిడీ చేస్తున్నారు...
రాష్ట్రంలో పంచభూతాలను సైతం దోపిడీ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. మహానాడు జరిగిన మూడు రోజుల్లో రాజధాని నిర్మాణం, ప్రజలకు చేసిన వాగ్దానాలు, ప్రమాణ స్వీకారం నాడు చేసిన ఐదు తొలి సంతకాలపైన చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు. మహానాడు ఆత్మస్తుతి పరనిందలకే పరిమితం అయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య చేసుకుంటుంటే పిండివంటలతో పండుగలా మహానాడు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. కలెక్టర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, అవినీతిలో భాగస్వాములైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను దగా చేశారన్నారు. విశాఖపట్నం సమ్మిట్‌లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని నిరుద్యోగ యువతను మోసం సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు, బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌బాబు, వైస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులుతో పాటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కో ఆర్డినేటర్లు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement