సాక్షి, హైదరాబాద్: పల్నాడులో జరిగిన రూ.లక్షల కోట్ల మైనింగ్ మాఫియా అవినీతిలో బడా బాబుల హస్తం ఉంది కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐ విచారణ జరక్కుండా సీబీసీఐడీ దర్యాప్తుకు ఆదేశించారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే భోగాపురం ఎయిర్‌పోర్టు టెండరు రద్దు, పల్నాడు మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. దమ్ముంటే పల్నాడు మైనింగ్‌లో సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాలును స్వీకరించాలని బొత్స డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి బాగోతాలు బద్దలయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
అమాయకులపై కేసులా?
సీఐడీ విచారణలో ప్రధాన నిందితులను పక్కనబెట్టి కూలీలు, సూపర్‌వైజర్లు, మేస్త్రీల మీద కేసులు బనాయించి వారినే ముద్దాయిలుగా చూపుతూ పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. మాఫియాలో చంద్రబాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హస్తం ఉందని, వారి పేర్లు చెప్పొద్దని స్థానికులను బెదిరిస్తున్నారన్నారు. వీరి పేర్లు, టీడీపీ పెద్దల పేర్లను చెప్పొద్దని పోలీసులు ప్రజలను బెదిరించడం సిగ్గు చేటన్నారు.
దోపిడీ కోసమే టెండర్ రద్దు
భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ వేసిందని, ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా.. టెండర్‌ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు కలిసి టెండర్‌ను రద్దు చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా లేఖ రాసిన నేపథ్యంలోనే భోగాపురం టెండర్లలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తమ పార్టీ ప్రధానికి లేఖ రాసిందని, దానికి సాంకేతిక పరిజ్ఞానం లేదని అప్పటి మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారన్నారు. పస్తుతం ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు.
సహాయక చర్యలేవీ?
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటన్నారు. జిల్లాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులను పంపాలని తమ పార్టీ కోరుతోందన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖ, కృష్ణా, విజయవాడ ప్రాంతాల్లోని ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరద ప్రాంతాల్లో జిల్లాల కలెక్టర్లు తప్ప ఎవరూ కార్యక్రమాలను పర్యవేక్షించటం లేదన్నారు. ఆ ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి తక్షణం సహాయ కార్యక్రమాలు చేయాలన్నారు.
రూ.కోట్లు తగలేసి ఇలాగేనా నిర్మించేది?
చిన్నపాటి వర్షాలకే రాజధానిలోని సచివాలయం, అసెంబ్లీ లీకులు అవుతోందన్నారు. వందలాది కోట్లు కుమ్మరించి నిర్మించిన తాత్కాలిక సచివాలయం పట్టుకుంటే పడిపోతుందని బొత్స మండిపడ్డారు. చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన భవనాల్లో లీకేజీల పర్వం కొనసాగుతోందని, పైకప్పు, గోడలు కూలిపోయే ఫొటోలు చూస్తే బాధగా ఉందన్నారు. ప్రజాధనం దోపిడీ చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
విషజ్వరాలు వచ్చినా పట్టించుకోరా?
ఉత్తరాంధ్రలో విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, పీహెచ్‌సీలలో ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు రోగులు పడుకుంటున్నారని, విజయనగరం పీహెచ్‌సీలో అసలు డాక్టర్లే లేరన్నారు. 108 అంబులెన్స్‌లు లేక మనుషులను మంచాలపై మోసుకొస్తున్నారన్నారు. పరిపాలనను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని, అవినీతి చేద్దామనే ఉద్దేశంతోనే మంత్రులున్నారు తప్ప ప్రజల కోసం పని చేయడం లేదన్నారు.
చంద్రబాబూ.. సీబీఐ విచారణకు సిద్ధమా?
Published Mon, Aug 20 2018 2:21 PM | Last Updated on Tue, Aug 21 2018 3:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment