సాక్షి, విజయవాడ : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఎందుకు కాపీ కొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు వల్లే అంటున్నారు.. మరి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక కాన్సెప్ట్ అని, ఏపీలో జగన్ ప్రభుత్వం రాబోతుందని భావించినందు వల్లే కేటీఆర్, వైఎస్ జగన్‌ని కలిశారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి టీడీపీ మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడటం బాగోలేదని బుగ్గన విమర్శించారు.
బట్లర్ ఇంగ్లీష్ మాటలు అందరికీ తెలుసు
చంద్రబాబు కేసీఆర్‌ను కలవొచ్చు గానీ వేరేవాళ్ళు కలిస్తే మాత్రం తెలుగు జాతికి ద్రోహం జరిగినట్లుగా ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయం అని బుగ్గన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీని దెయ్యం అని, రాహుల్ గాంధీని జోకర్ అన్న చంద్రబాబు.. ఇప్పుడు వారితో కలవడం చారిత్రక అవసరం అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అప్పుడేమో హోదా వద్దు ప్యాకేజీ కావాలని అన్నారు... మళ్ళీ ఇప్పుడు హోదా అంటున్నారు అసలు హోదాపై మీకు స్పష్టమైన వైఖరి ఉందా అని ప్రశ్నించారు. కలకత్తా వెళ్లి బట్లర్ ఇంగ్లీష్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. ‘మళ్ళీ మీరే రావాలి’ అని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదో చెప్పాలని.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
ఆ నిర్ణయాలు ఆషాఢం సేల్స్ ఆఫర్లలా ఉన్నాయి
ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఆషాడం సేల్స్ ఆఫర్లలా ఉన్నాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరిగితే... చంద్రబాబు హయాంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టింది తమ పార్టీయేనని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామిలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కనపడ్డ చోటల్లా శిలాఫలకాలు ఏర్పాటు చేసి.. ఇంకెంత కాలం ప్రజలని మోసగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఫింఛన్లు పెంచని చంద్రబాబు ఇప్పుడెందుకు హఠాత్తుగా పెంచారని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బాబుకు భయం పట్టుకుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment