హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయిన చంద్రబాబుపై ఆంధ్రాద్రోహి అనే ముద్రకూడా పడే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ఒకే స్టాండ్‌పై ఉంటే ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేదని, గడికోమాట మాట్లాడి హోదా రాకుండా చేసింది చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొంగలా దొరికి పారిపోతే, పార్టీని నమ్ముకున్న వారంతా ఏం కావాలని ప్రశ్నించారు.
తెలంగాణలో టీడీపీ భూస్థాపితం
చంద్రబాబు మోసపూరిత, వెన్నుపోటు విధానాలవల్ల తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటీ గెలవలేదని, పార్లమెంట్‌లో అభ్యర్థులను నిలిపే దమ్ము కూడా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చూడలేని బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే కేసీఆర్‌కు కూడా వెన్నుపోటు పొడిచేందుకు చూశాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు చూసి అడ్డంగా దొరికిపోయాడన్నారు.
హోదా అడిగే హక్కు బాబుకు లేదు
ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని కోరుకునే వాడైతే ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్‌పై చంద్రబాబు ఎందుకు నిలబడలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నాలుగున్నరేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోదీతో చేయికలిపి ఇద్దర్ని కేంద్రమంత్రి వర్గంలో ఉంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలి అని అడగలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలన్నీ పేర్లుమార్చి కాపీ కొట్టిన ఘనత చంద్రబాబుదని, ఇన్నిరోజులూ గుర్తుకురాని నిరుద్యోగభృతి, రైతుబంధు, పసుపు కుంకుమ ఎన్నికలముందే గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలెవరూ చంద్రబాబుకు ఓటువేయరాదని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆత్మగౌరవం అనే పదం వాడే హక్కు బాబుకు లేదని, నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆంధ్రాలో జగనే సీఎం
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. ప్రభుత్వాలు మారితేనే పేదలు బాగుపడతారని, ఆంధ్రా ప్రజలు జగన్‌కు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క మాటపై నిలబడేవారని, బాబుది రెండు నాలుకల ధోరణి అన్నారు. జగన్‌ను ఏదోఒకవిధంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రాప్రజానీకం గుర్తించాలన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు రావడంతో ఆయనకు మతి భ్రమించిందన్నారు.
చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలి
Published Thu, Mar 28 2019 3:34 AM | Last Updated on Thu, Mar 28 2019 8:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment