జార్జ్ ఆర్వెల్ రచించిన 1984 అన్న నవలలో బిగ్ బ్రదర్ కేరక్టర్ గుర్తుందా ? ప్రజలందరి కదలికల్ని నిశితంగా గమనిస్తూ, వారిపై పట్టు సాధించడానికి అధి నాయకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. బిగ్ బ్రదర్ వాచింగ్ యూ అంటూ హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడు. అచ్చంగా ఆ ఫిక్షన్ కేరక్టర్‌ని తలపించేలా సామాజిక మాధ్యమాల కట్టడికి బిగ్ బ్రదర్ పేరుతో ఒక కొత్త టూల్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ టూల్ సోషల్ మీడియాలో ఉన్న వారందరినీ ఓ కంట కనిపెడుతుంది.
ఎక్కడ ఎవరు ఏ ట్వీట్ చేసినా, ఏ పోస్టు చేసినా, ఏ సమాచారాన్ని షేర్ చేసినా ఈ టూల్ దుర్భిణి వేసి మరీ చూస్తుంది. కేంబ్రిడ్జి ఎనలైటికా ఉదంతంతో వినియోగదారుల డేటా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధమైన కేంద్రం వివిధ కంపెనీలు వినియోగదారుల సమాచార చౌర్యానికి ప్రయత్నించినా పసిగట్టేలా ఈ టూల్ తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు ఓపెన్ చేసి చూస్తే చాలు అన్నీ ఫేక్ న్యూస్‌లే. బీహారీ గ్యాంగులొచ్చి హైదరాబాద్‌లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారట, పాపం ఫలానా నటీమణి చనిపోయిందట లాంటి తప్పుడు వార్తలతో పాటు రాజకీయ నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు ఇష్టారాజ్యంగా షేర్ అవుతూ ఉండడంతో బిగ్ బ్రదర్ టూల్ ద్వారా వాటికి చెక్ పెట్టడానికి యోచిస్తోంది. సోషల్ మీడియా పోస్టులు మాత్రమే కాదు, ఈ మెయిల్స్ కంటెంట్‌ని కూడా పరిశీలించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ మీడియా పర్యవేక్షణా వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్ర సమాచార ప్రసార శాఖ బిడ్స్‌ని కూడా ఆహ్వానించింది. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ విషయాన్ని విశ్లేషించేలా సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ పేరుతో ఒక పర్యవేక్షణా వ్యవస్థని ఏర్పాటు చేయాలనే యోచనలో కూడా కేంద్రం ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతీ పోస్టుని పరిశీలించడానికి వీలుగా దేశవ్యాప్తంగా 716 జిల్లాల్లో కొన్ని బృందాల్ని ఏర్పాటు చేయడానికి ప్రైవేటు సంస్థల సహకారాన్ని తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి వివిధ సంస్థల నుంచి సలహాలు, సూచనలు కోరుతోంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశాలు, కొత్తగా వస్తున్న హ్యాష్‌ట్యాగ్‌లు, ఇతర సమాచారాన్ని క్రోడీకరించి కేంద్రానికి నివేదికలు అందేలా ఈ బిగ్ బ్రదర్ టూల్‌ని తయారు చేయాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టూల్ సామాజిక మాధ్యమాల్ని విశ్లేషించే సెర్చ్ ఇంజిన్‌లా ఉండాలన్నది కేంద్రం భావన. సోషల్ మీడియాపై కేవలం నియంత్రణే కాదు, ఈ టూల్ ద్వారా ప్రజల్లో ఉండే మూడ్ దేశ ప్రయోజనాలకు ఎలా అనుకూలంగా మార్చాలి, ప్రజల్లో జాతీయతా భావం పెంపొందించడానికి ఏం చేయాలి వంటి అంశాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే బ్రేకింగ్ న్యూస్, ప్రింట్ మీడియాలో వచ్చే వార్తల్ని విశ్లేషించడం, వాటిల్లో తప్పుడు వార్తల్ని పసిగట్టేలా టూల్‌ని రూపొందించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. అయితే దీని వల్ల వినియోగదారుల డేటా మరింత ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల్లో గెలుపు కోసమే : మండిపడుతున్న విపక్షాలు
సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల సమాచారాన్ని సేకరించి, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు కోసం వ్యూహాలు రచించడానికే ఈ ప్రణాళిక రూపొందించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘బిగ్ బ్రదర్ టూల్ కచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలన్న బీజేపీ ఆరాటం ప్రమాదస్థాయికి చేరుకుంది. ఇదంతా దేశ ప్రయోజనాల కోసం కాదు, ఎన్నికల్లో వారి స్వప్రయోజనాల కోసం, ఓటర్లని ప్రభావితం చేయడం కోసం‘ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్ ఆరోపించారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment