
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు వాటిని విక్రయించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది ఎకరాకు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తే, ఈసారి నకిలీ విత్తనాల వల్ల దిగుబడి 5 క్వింటాళ్లకు పడిపోయిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మరో వైపు మార్కెట్‌లో పత్తికి క్వింటాల్‌కు రూ.4వేల ధర కూడా రావడం లేదని, దీంతో పెట్టుబడి డబ్బులు కూడా రాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. అలాగే వరి పంటకు దోమపోటు సోకడంతో పంట ఉత్పత్తి తగ్గిపోయి, రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోమపోటుకు గురైన వరి, నకిలీ విత్తనాలతో దిగుబడి పడిపోయిన పత్తి పంటలపై సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment