
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త అపరిచితుడు చంద్రబాబు నాయుడు వచ్చాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ..అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. సొంత జిల్లాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోడని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టికుని భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అందుకు నిదర్శనం అమిత్ షాపై దాడేనని వ్యాఖ్యానించారు. బాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతకాలం మనగగలుగుతాడో చూద్దామన్నారు.
నాలుగేళ్లు మిత్రపక్షంలో ఉంటూనే లోలోపల ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపించారు. పోలవరంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పెట్టాల్సి ఉన్నా అది కూడా వద్దు అని కేంద్రమే పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికీ చెబుతున్నాం పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. హోదా ఇవ్వడం కుదరదు అని ఎప్పుడో బాబుకు చెప్పామని, మొదటి నుంచి మోదీ ఇస్తాను అన్నది స్పెషల్ ప్యాకేజీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్యాకేజీ ద్వారా సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని తెలిపారు.
ప్యాకేజీకు ఒకే చెప్పిన బాబు, వెంకయ్యనాయుడుని పట్టుకుని బీజేపీకి జై అంటూ ఊరూరా ప్రచారం చేశాడని విమర్శించారు. ఎక్స్టెర్నల్ ఏజన్సీ నుంచి ప్యాకేజీ నిధులు తెచ్చుకోలేకపోయింది చంద్రబాబేనని ఆయన అసమర్థతను వెల్లడించారు. బాబు చేతగానితనాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లకు భయపడి మోదీపై ఆరోపణలు చేయడం మొదలెట్టాడని బాబు కుటిలయత్నం గురించి వివరించారు. ప్రజల సొమ్ముతో అమరావతి డిజైన్లు పేరుతో ప్రత్యేక విమానం వేసుకుని పదహారు దేశాలు తిరిగాడని, చివరికి చేసింది ఏమీ లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు.
రాజధాని నిర్మాణం కోసం నమ్మి భూములు అప్పచెప్పిన స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, రాజధానిలో శంఖుస్థాపన చేసిన వాటిలో 90 శాతం వాటికి ఇంకా పనులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. ఇవి లేఖ ద్వారా ప్రశ్నించిన భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారని తెలిపారు. నోట్ల రద్దు నా ఆలోచన అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక బీజేపీనే చేసింది అనడం అబద్ధం కాదా సూటిగా అడిగారు. మహానాడుగా పిలువబడే మాయనాడులో మూడేళ్లు వైఎస్సార్‌సీపీపై పడి ఇప్పుడు బీజేపీపై పడి ఏడుస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment