వాటిని చూసి కంగారుపడొద్దు..:చంద్రబాబు | Chandrababu Comments About Exit polls | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దు 

Published Wed, May 15 2019 3:53 AM | Last Updated on Wed, May 15 2019 11:59 AM

Chandrababu Comments About Exit polls - Sakshi

సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 19వ తేదీతో అన్ని దశల ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మవద్దని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చినా కంగారు పడొద్దని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నితిన్‌ గడ్కరీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని, అలా జరిగితే తమకు మంచిదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గడ్కరీతో టీడీపీకి మంచి సంబంధాలున్నాయని ఆయనైతే తమకు ఇబ్బంది ఉండదని చెప్పారు. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ సమావేశానికి ముందు ఆయన మంత్రులతో తాజా రాజకీయాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  

వాటిని చూసి కంగారుపడొద్దు.. 
దేశంలో మోదీకి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయని, ఆయన మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదని సమావేశంలో చంద్రబాబు పేర్కొనగా మంత్రి సోమిరెడ్డి తదితరులు దీన్ని సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో మోదీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదంటూనే ఎన్డీఏ అధికారంలోకి వస్తే రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కారీలకు ప్రధానిగా అవకాశం దక్కవచ్చనే అంశంపై చర్చ జరిగింది. గడ్కారీ అయితే టీడీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయనతో తమకు మంచి సంబంధాలున్నాయని చంద్రబాబు సహా మంత్రులు అభిప్రాయపడ్డారు. యూపీఏ అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంకకు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.  

ఫలితాలపై ఆర్టీజీఎస్‌ మాట్లాడదేం? 
పసుపు కుంకుమ, పించన్లే ఈసారి తమను గెలిపిస్తాయని మంత్రులంతా చెప్పగా దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం పసుపు కుంకుమ ప్రభావం పెద్దగా లేదని, పించన్ల ప్రభావం ఎక్కువ ఉందని చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు మాత్రం పసుపు కుంకుమ ప్రభావం ఈ ఎన్నికల్లో బాగా ఉందని అదే ఈసారి టీడీపీ గెలిపిస్తుందని చెప్పారు. అన్నిచోట్లా వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందనే ప్రచారం జరుగుతున్నా సమీకరణల దృష్ట్యా చూస్తే టీడీపీ గెలుస్తుందని పలువురు మంత్రులు చంద్రబాబుకు నివేదించారు. తుపానులు, ఎండలు అన్నింటినీ కచ్చితంగా ట్రాక్‌ చేస్తున్న ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌బాబు ఎన్నికల ఫలితాల గురించి మాత్రం ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రస్తావించగా ఆయన మీకు చెవిలో చెబుతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాజకీయ అంశాలపైనే చర్చ  
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తిగా రాజకీయ అంశాలపైనే జరిగింది. అత్యవసరంగా నిర్వహించాలని హడావుడి చేసిన సీఎం చంద్రబాబు తీరా ఈ సమావేశాన్ని తూతూమంత్రంగానే ముగించారు. కరువు, ఉపాధి హామీ, ఎండల ప్రభావం, నీటి ఎద్దడికి సంబంధించిన అంశాలపై గంట కూడా చర్చించలేదు. ఎన్నికల ఫలితాలు, తర్వాత వచ్చే ప్రభుత్వం, జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చించుకున్నారు. చంద్రబాబు సైతం వాటి గురించే ఎక్కువసేపు మాట్లాడడం గమనార్హం. ఈ సమావేశానికి మంత్రులు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, సుజయకృష్ణ రంగారావు డుమ్మా కొట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఈ సమావేశంలో మాత్రం ఆయన ఎన్నికల్లో బాగా పనిచేశారని అభినందించడం కొసమెరుపు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement