విద్యార్థికి సర్టిఫికెట్, జ్ఞాపిక అందజేస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. అందుకే కేంద్రంపై పోరాటం ప్రారంభించానని చెప్పారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తయారుచేస్తామన్నారు. రాష్ట్రంలో 11.72 శాతం గ్రోత్ సాధించామని.. 2029 నాటికి నంబర్ వన్ స్టేట్‌గా నిలుపుతానన్నారు. ప్రపంచం మెచ్చుకునే నగరంగా అమరావతిని నిర్మిస్తామని.. దేశంలో తాజ్‌మహల్ తర్వాత మన అసెంబ్లీనే సుందర కట్టడంగా నిలుస్తుందని చెప్పారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.3,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని సీఎం చెప్పారు.
11 ఇన్‌స్టిట్యూషన్స్‌కు సంబంధించి రూ.600 కోట్లే ఇచ్చారన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా పట్టించుకోకపోవడంతో పోరాటం మొదలుపెట్టానన్నారు. దీంతోనే టీడీపీ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు మొదలయ్యాయన్నారు. సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థలను కేంద్రం స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీతో ఉన్నంతకాలం తమపై దాడులు జరగలేదన్నారు. రామాయపట్నం పోర్టుకు ఈ నెలలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అంతకుముందు టంగుటూరు ప్రకాశం పంతులు యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.3.39 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక విఫల ప్రయోగమే..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక విఫల ప్రయోగమే అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తున్నామని చెప్పారు. బుధవారం టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణ ఫలితాలను ఇతర రాష్ట్రాలతో పోల్చడానికి లేదన్నారు. బీజేపీ పాలనను అంతమొందించాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని.. ఇందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీజేపీతో పోరాడేందుకు కేసీఆర్ కలిసి రాలేదని విమర్శించారు. విభజన చేసిన కాంగ్రెస్ ఏపీకి కొన్ని హామీలిచ్చిందని.. వాటిని అమలు చేయకుండా బీజేపీ నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. బీజేపీయే ప్రధాన శత్రువన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు, 13 మంది మంత్రులు తిరిగినా తెలంగాణలో బీజేపీ ఒక్కసీటే గెలిచిందన్నారు.
పద్మశాలీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న పద్మశాలి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పద్మశాలి సంఘంరాష్ట్ర అధ్యక్షుడు కె.ఎ.ఎన్.మూర్తి బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment