సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిని గెలిపించుకోవాలన్న కుతంత్రంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా పచ్చనోట్ల వరద పారించేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో మహాకూటమికి అధికారాన్ని కట్టబెట్టేందుకు రూ.500 కోట్లను ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ ఎస్‌లో తనకు సన్నిహితులైన ఓ 10 మంది అభ్యర్థుల ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు వెల్లడించినట్లు తెలిసింది.
కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు ఏమైనా తగ్గితే.. ఆ పదిమందిని తీసుకురాగలనని బాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ నేత ఒకరు రాష్ట్ర కాంగ్రెస్ నేతతో ఈ విషయంపై ఆరాతీసి ధ్రువీకరించుకున్నట్లు సమాచారం. అటు, ఇప్పటికే ఈ రూ.500 కోట్లను హైదరాబాద్‌లోని పలుచోట్ల దాచిపెట్టారని సమాచారం. టీడీపీకి అనుకూలంగా ఉండే నలుగురు వ్యాపారులు, ఇద్దరు కాంట్రాక్టర్ల కనుసన్నల్లో ఈ డబ్బులను దాచే వ్యవహారం కొనసాగుతోందని తెలంగాణ నిఘావర్గాలకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే కరీంనగర్‌కు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, మహాకూటమిలో చక్రం తిప్పాలని బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల సేవలను వినియోగించుకుని.. కాంగ్రెస్‌లో విజయావకాశాలున్న అభ్యర్థుల జాబితాను తయారుచేశారు. శనివారం నాటి ఢిల్లీ పర్యటనలో రాహుల్ సమావేశమై ఈ జాబితాను అందజేయనున్నారు. తెలంగాణలో తాను జరిపించిన సర్వేలో కూటమి గెలిచేందుకు అవకాశాలున్నట్లు తేలిందన్న నివేదికనూ ఈ జాబితాకు జతచేర్చనున్నారు.
అందుకే.. కాంగ్రెస్ తరఫున దాదాపు 60 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ.. చంద్రబాబు నివేదిక అందిన తరువాత అందులో వివరాలు పరిశీలించి అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు స్వయంగా వెల్లడించడం గమనార్హం.
రూ.500 కోట్లకు అదనంగా..
టీడీపీతోపాటు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సమకూర్చుతానని రాహుల్‌గాంధీకి ఇటీవలే బాబు హామీ ఇచ్చారు. తమ కూటమి అభ్యర్థుల విజయానికి రూ.500 కోట్లు సిద్దంగా ఉంచానని, అవసరమైతే మరింత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడబోనని బాబు పేర్కొన్నట్లు కాంగ్రెస్ వర్గాలే చెపుతున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి ద్వారా ఈ డబ్బు పంపిణీ చేసేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. నాడు జర్నలిస్టుగా ఉన్న ఇప్పటి సదరు పత్రికాధిపతి ఇంటినుంచే చంద్రబాబు అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే.
ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సన్నిహితంగా ఉంటున్న ఆ పత్రికాధిపతికి డబ్బు పంపిణీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న యోచనలో బాబు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో భాగస్వామ్యం అయ్యేందుకు.. ఇంత భారీ ఎత్తున డబ్బు ఖర్చుచేస్తూ కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న టీడీపీ అధినేత..వచ్చే ప్రభుత్వంలో తన పార్టీకి హోం శాఖ కేటాయించాలని రాహుల్‌కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఓ పత్రికాధిపతి పర్యవేక్షణలో..
ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిసింది. ఇటీవల ఈ రెండు కంపెనీలపై జరిగిన ఐటీ దాడుల్లో డొల్ల కంపెనీలకు భారీగా డబ్బు తరలించినట్లు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ డబ్బును ఎక్కడ నిల్వ చేశారన్నది నిఘా సంస్థల వద్ద సమాచారం ఉంది. హైదరాబాద్‌లో బడావ్యాపారులుగా చెలామణీ అవుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యాపార ప్రముఖులు మరో రూ.150 కోట్లు ఎన్నికల కోసం నిల్వ చేశారు. ఈ సొమ్ములో కొంత ఇప్పటికే జిల్లాల్లో అవసరమైన టీడీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు సమాచారం. కరీంగనర్‌కు నగదు పంపేక్రమంలో ఓ వ్యాపారి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకోవడంతో ఈ రవాణా ప్రస్తుతానికి ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే బాబు సన్నిహిత పత్రికాధిపతి సమక్షంలో డబ్బు పంపిణీకి వ్యూహరచన జరుగుతోందని సమాచారం.
అంబులెన్స్‌ల్లో డబ్బు పంపిణీ
చంద్రబాబు సమకూర్చిన ఈ రూ.500కోట్లను పంపిణీ చేసేందుకు అంబులెన్స్‌లను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ అధినేతకు సన్నిహితుడైన ఓ మెడికల్ కాలేజీ యజమానితో సంప్రదింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ.. విజయవాడలో ఓ ప్రముఖ వైద్య కళాశాల నుంచి ఎవరికి అనుమానం రాకుండా రాత్రిపూట అంబులెన్స్‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా డబ్బును సరఫరా చేసింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయడానికి వీలుగా ఆ వైద్యకళాశాలతో పాటు తన సామాజిక వర్గానికే చెందిన మరో రెండు కార్పోరేట్ వైద్యశాలల సహకారం కోరినట్లు తెలిసింది.
నిఘావర్గాల సమాచారంతో ఇప్పటివరకు వీరు పన్నిన కుట్రలను తెలంగాణ పోలీసులు వమ్ము చేశారు. ఈ నేపథ్యంలోనే అంబులెన్స్‌లపై ఆధారపడాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా, ‘డబ్బు ఎక్కడ నిల్వ చేశారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారన్న విషయాలను చూచాయగా తెలుసుకున్నాం. ఖమ్మం జిల్లాలో ఒక చోట రూ.250 కోట్లు దాకా నిల్వ చేసినట్లు సమాచారం ఉంది. అయితే, పక్కా సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం. ఏపీలో వచ్చే ఎన్నికలకు కొన్ని జిల్లాలకు ఖమ్మం నుంచి డబ్బు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల ద్వారా తెలిసింది’అని ఐజీస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.
హోం శాఖే ఎందుకు?
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే టీడీపీకి హోం శాఖ ఇవ్వాలన్న చంద్రబాబు తలంపు వెనుక కారణం.. ఓటుకు కోట్లు కేసు. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడితే భవిష్యత్‌లో ఇబ్బంది ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం వెనక కూడా ఇదే కారణమని కాంగ్రెస్ వర్గాలు ప్రైవేట్ సంభాషణల్లో చెపుతున్నాయి. ఒకవేళ కూటమి గెలవలేకపోతే.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఓటుకు కోట్లు కేసును మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిద్ధం చేసుకున్నారని బాబుకు భయం పట్టుకుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
అందుకోసమే.. చంద్రబాబు ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేయడానికి పూనుకున్నారు. ఈ వ్యూహం కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదని.. ఏడాదిగా హైదరాబాద్‌లో డబ్బు నిల్వ చేసినట్లు సమాచారం. ఏపీలో సాగునీటిశాఖ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి రూ.350 కోట్లు ఇక్కడే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికే చెందిన ఒకరితో పాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు (కాంట్రాక్టర్) ఈ మొత్తాన్ని ఇప్పటికే సమకూర్చిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment