మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు , గద్వాలలో జరిగిన సమావేశానికి హాజరైన కార్యకర్తలు
సాక్షి, గద్వాల: ‘ఓటమి ఎరుగని నేతను నేను.. కేసీఆర్ నాకు ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా పూర్తి చేశా.. అదే బాటలో గద్వాల, అలంపూర్‌లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకువెళ్తా’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంతో పాటు అలంపూర్‌లో జరిగిన సభల్లో ఆయన వేర్వేరుగా మాట్లాడారు. ఇది గద్వాల, అలంపూర్‌లలో తొలి అడుగు మాత్రమేనని ఈ సందర్భంగా హరీశ్ స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు.
అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ బాబు
తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అడుగడుగునా రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్న చంద్రబాబుతో మహాకూటమి పేరిట కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిర్వచనమని.. చంద్రబాబు గతంలో మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొని వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలోనే మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా మారిందన్నారు. పోతిరెడ్డిపాడును బద్దలు కొట్టి మహబూబ్‌నగర్‌కు రావల్సిన నీటిని ఆం«ధ్రాకు తరలించారని ఆరోపించారు. ఆర్డీఎస్ తూములను బాంబులు పెట్టి పేల్చి, ఇక్కడి రైతులకు సాగునీరు లేకుండా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన వారిని వెనక్కి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఎటు చూసినా చెరువులు, రిజర్వాయర్ల నీటితో కళకళలాడుతోందని అన్నారు.
ఆ ప్రశ్నలకు జవాబేది?
చంద్రబాబుకు తాను 19 ప్రశ్నలతో లేఖ రాస్తే వాటికి సమాధానాలు చెప్పకపోగా.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి చంద్రబాబును వెనకేసుకొస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే నాగార్జునసాగర్‌పైన 45 టీఎంసీల నీళ్ల హక్కులు దొరుకుతాయని చెప్పారని గుర్తు చేశారు.
45 టీఎంసీల నీరు తెలంగాణకు వచ్చి ఉంటే కల్వకుర్తి, నెట్టెంపాడుకు నికర జలాలు కేటాయించుకొని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు వీలుండేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వరాదని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడును బద్దలు కొట్టి ఏపీకి నీటిని తరలిస్తుంటే అప్పట్లో డీకే అరుణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్ల కోసమని అన్నారు.
మహాకూటమిని మట్టి కరిపించండి
కృష్ణానదీ జలాల్లో మనవాటా మనకు దక్కాలంటే, పాలమూరు పచ్చబడాలంటే, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి రెండు పంటలు పండాలంటే టీఆర్‌ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని హరీశ్‌రావు అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా టీఆర్‌ఎస్ మద్దతు ఉండాల్సిందేనని, కేంద్రంలో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రద్దు.. లేకపోతే వద్దు
ఇటీవల కాంగ్రెస్ నాయకుల నోటినుంచి రద్దు.. లేకపోతే వద్దు... అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయని, ఆ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేస్తామని ఓ నాయకుడు అంటే.., మరో నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి వద్ద ఉన్న విద్యుత్ ప్లాంట్‌ను మూసేస్తామని అంటున్నారని చెప్పారు. అంటే తెలంగాణకు వెలుగులు వద్దా? అని ప్రశ్నించారు.
మరో నాయకుడు కల్యాణలక్ష్మిని రద్దు చేస్తామని, మరో నేత అంజన్‌కుమార్ యాదవ్ డ్రంకెన్ డ్రైవ్‌ను బంద్ చేస్తానని చెబుతున్నారని.. అంటే ‘ఎవరైనా ఫుల్లుగా తాగొచ్చు, ఊగొచ్చు. మనుషుల ప్రాణాలు తీయొచ్చు, పోగొట్టుకోవచ్చా’అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటు ఎలా వేయాలో ఆలోచించాలన్నారు. రద్దు.. రద్దు అని కాంగ్రెస్ వాళ్ల మాటలు విని కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల, అలంపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment