
40 ఏళ్ల అనుభవానికి చివరకు ఈ గతి పట్టిందా.. అయ్యో..
సాక్షి, నెల్లూరు : జిల్లాలో నిర్వహించిన రోడ్‌షో.. బహిరంగ సభలకు జన స్పందన లేకపోవడంతో జిల్లా నేతలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభలకు జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని తీవ్ర అసహనం వ్యక్తి చేసినట్లు సమాచారం. మంగళవారం నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో జనాలు లేక వెలవెలబోయిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రోడ్ షోలు విఫలమైతే రాష్ట్రమంతా ప్రతికూల సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు తమ్ముళ్లకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీ పరిస్థితి బాగాలేదని, ఇలా అయితే కష్టమని మందలించినట్లు సమాచారం. జనాధరణ లేని ఈ రోడ్ షోలకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటోలతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘బాబు గారి రాజకీయ జీవితం చివరి దశకు చేరింది అనటానికి ఇదే సాక్ష్యం’ అని ఒకరు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు చివరకు ఈ గతి పడుతుందని ఊహించలేదని మరోకరు కామెంట్ చేస్తున్నారు. దీనికి తోడు ‘నేను ఓడిపోతే నాకు కుటుంబం ఉంది. భార్య, కుమారుడు, మనవడు ఉన్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడం టీడీపీ ఓటమి తప్పదనే భావనను కలిగిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, దీంతోనే ఇలా అసహనానికి గురవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.