కరువుకు తోబుట్టువు! | Chandrababu Government Failed To Fulfil The Promises Of Anantapur District | Sakshi
Sakshi News home page

కరువుకు తోబుట్టువు!

Published Mon, Apr 8 2019 8:44 AM | Last Updated on Mon, Apr 8 2019 8:44 AM

Chandrababu Government Failed To Fulfil The Promises Of Anantapur District - Sakshi

వ్యవసాయమే ఆధారం.. కష్టాన్నే నమ్ముకున్న ప్రజలు ఏళ్ల తరబడి కరువు దెబ్బకు అతలాకుతలమయ్యారు. కరువు జనాలకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీల గాలం వేశారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పారిశ్రామిక ప్రగతి.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. కులానికో హామీ.. వర్గానికో న్యాయం అనే తరహాలో మాయమాటలు చెప్పారు. చివరకు వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం, బలిజలను బీసీల్లో చేరుస్తామని మాట ఇచ్చారు. ఇవన్నీ నిజమేనని నమ్మిన జిల్లా ప్రజానీకం టీడీపీకి పట్టం కట్టారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల టీడీపీ అభ్యర్థులనే గెలిపించారు. 2 ఎంపీ స్థానాల్లోనూ వారికే కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు.

ఒకటి... రెండు కాదు.. ఐదేళ్లూ హామీలతోనే కాలం నెట్టుకొచ్చారు. జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించాల్సిన ఇద్దరు ఎంపీలతో పాటు 12 మంది ఎమ్మెల్యేలు మిన్నకుండిపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దోచుకోవడం మినహా జిల్లా అభివృద్ధిని కాంక్షించలేకపోయారు. అందుకే ప్రకృతి సహకరించక.. పాలకులు పట్టించుకోక.. అప్పుల బాధతో ఈ ఐదేళ్లలో 274 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరులో మోసం 
వర్షాభావంతో పంటలు ఎండిపోయినా.. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో ప్రభుత్వాలు ఆదుకుంటాయనే ఆశతో రైతులు పంటసాగుకు ఉపక్రమిస్తుంటారు. 2013లో పంటలు దెబ్బతినగా...రూ.643 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తామని ఎన్నికల్లో, ఎన్నికల తర్వాత సీఎం, మంత్రులు ప్రకటించారు. గద్దెనెక్కిన తర్వాత  ఇచ్చేది లేదని రైతులకు మోసం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం బొక్కేసి మోసం చేసింది. 

తాగునీటికీ కటకటే.. 
జిల్లాలో తాగునీటి సమస్య కొన్నేళ్లుగా వేధిస్తోంది. ‘అనంత’ వాసుల తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలకు శ్రీకారం చుట్టారు. పీఏబీఆర్‌ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా హిందూపురం వరకూ తాగునీరు అందించారు. ఇక రూ.507 కోట్లతో 5 నియోజకవర్గాలకు నీరిచ్చేందుకు వైఎస్సార్‌జిల్లా గండికోట నుంచి జేసీనాగిరెడ్డి మంచినీటి పథకానికి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. 2013 వరకూ 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలిపోయాయి. కానీ ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఈ పనులు కూడా చేయలేకపోయింది. దీంతో తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, శింగనమల, అనంతపురం రూరల్‌ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. 

క్యాన్సర్‌ ఆస్పత్రి ఊసేలేదు 
టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంలో బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. బాలయ్యను ‘పురం’వాసులు గెలిపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ‘కాన్సర్‌ ఆస్పత్రి’ని పక్కనపెట్టారు.. బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’ అమలయ్యేలా చూస్తానని చెప్పారు. ఐదేళ్లలో క్యాన్సర్‌ ఆస్పత్రి లేదు..ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో వైద్యసేవ లేదు. 

పారిశ్రామిక ప్రగతీ శూన్యం  
జిల్లాలో వ్యవసాయం అంతంతమాత్రమే. అందువల్ల ఉపాధి కోసం విరివిగా పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉంది. తెలుగురాష్ట్రాల్లో అన్ని జిల్లాలో కంటే బీడుభూములు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు యాజమాన్యం కలిసి ‘ట్రైపార్టీ’ ఆధ్వర్యంలో ఏర్పాటుకు బీజం పడిన  కుద్రేముఖ్‌ ఇనుప పిల్లెట్ల పరిశ్రమను నిర్లక్ష్యం చేసింది. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా..దాని ఊసే లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ‘బెల్‌’ మినహా ఒక్క పరిశ్రమకూ పునాది పడలేదు. ఇందులో కూడా స్కిల్డ్‌ లేబర్‌ మినహా జిల్లా వాసులకు ఉపాధి లభించడం కష్టమే. తిరుపతిలో ఎయిర్‌పోర్టు ఉన్నా, తిరిగి కుప్పంలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. ‘అనంత’కు గత ప్రభుత్వంలో మంజూరైన ఎయిర్‌పోర్టు, పుట్టపర్తిలో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమనూ చంద్రబాబు అటకెక్కించారు. 

ఇళ్ల నిర్మాణంలో అన్యాయం 
చంద్రబాబు 2014 జూన్‌లో సీఎంగా అధికారం చేపట్టారు. రెండున్నరేళ్లపాటు ఒక్క పక్కా ఇల్లు కూడా నిర్మించలేకపోయారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఆ తర్వాత అరకొరా మంజూరు చేశారు. అందువల్లే ఈ ఐదేళ్లలో 60 వేల ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు అధికారికంగా లెక్క చూపిస్తున్నారు. ఇందులో వాస్తవానికి 60 శాతం కూడా పూర్తయి, లబ్ధిదారులు ఇళ్లలో చేరని పరిస్థితి. ప్రభుత్వం చెప్పినట్లు ఐదేళ్లలో 60 వేల ఇళ్లు పూర్తయినట్లు లెక్కించినా... జిల్లాలోని 3,500 గ్రామాల్లో గ్రామానికి 17 ఇళ్లు మాత్రమే మంజూరైనట్లు.
 
పింఛన్లు అందక విలవిల 
రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు భూమి ఉన్నవారే పింఛన్‌కు అర్హులు. కానీ ‘అనంత’లో మాత్రం పదెకరాలున్నవారికి కూడా పింఛన్‌కు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కోసం ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం ఇదొక్కటే. కానీ పింఛన్ల కోసం జన్మభూమి సభలు, ‘మీ కోసం’లో 89 వేల దరఖాస్తులు రాగా... 49,543 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. పోని వీటికైనా పింఛన్‌ మంజూరు చేశారా..? అంటే అదీ లేదు. దీంతో పింఛన్‌లేక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

జిల్లా అభివృద్ధిని విస్మరించిన ఎమ్మెల్యేలు 
కరువు జిల్లా ‘అనంత’ అభివృద్ధిని అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా పూర్తిగా విస్మరించారు. అందిన కాడికి దోచుకుంటూ వారు మాత్రమే అభివృద్ధి చెందారు. అభివృద్ధి పేరుతో ఎన్నికల ముందు సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు పెంచి, నీరిచ్చే పేరుతో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసి కుంభకోణం చేశారు. పేరూరు పేరుతో మంత్రి పరిటాల సునీత, బీటీపీ పేరుతో కాలవ శ్రీనివాసులు, 36వ ప్యాకేజీలో పయ్యావుల కేశవ్, కాంట్రాక్టుల పేరుతో వరదాపురం సూరి, ‘కియా’లో భూములు చదును చేసే పేరుతో బీకే పార్థసారథి, గుంతకల్లు–తాడిపత్రి హైవే పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి ఇలా...జిల్లాలోని ప్రతీ అధికారపార్టీ ప్రజాప్రతినిధి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ఇలా ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడం మినహా జిల్లాకు చేసిందేమీ లేదు.  

హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరేదీ?
హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. ఇందులో అత్యధికంగా ‘అనంత’లో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటిలో ఫేజ్‌–1లో 1.18 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. 2012కు ఫేజ్‌–1 పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొస్తున్నాయి. ఏడాదిలో ఆయకట్టుకు నీళ్లిస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటరీలు చేయాలంటే 6 నెలల సమయం సరిపోతుంది. కానీ నీళ్లిస్తామని చెప్పిన ఏడాదికి ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేసింది.దీంతో కళ్లెదుట నీళ్లుపోతున్నా...పొలంలో పారించుకోలేని దుస్థితి నెలకొంది. దీనిపై ఏ అధికార పార్టీ నాయకుడూ ప్రశ్నించలేకపోయారు. కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇచ్చే ప్రసక్తే లేదని 2017 సెప్టెంబరు 1 రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అయినా జిల్లా ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. దీంతో కృష్ణా జలాల కోసం ఆశగా ఎదురుచూసిన రైతులు చంద్రబాబు వైఖరితో రగిలిపోతున్నారు. ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు.  

   

ఇచ్చిన హామీలు   ప్రస్తుతం ఉన్నతీరు    
హిందూపురంలో బసవతారకం కేన్సర్‌ ఆస్సత్రి ఇప్పటి వరుకు అతీగతీ లేదు
5 ఎకరాల వరకూ వందశాతం సబ్సిడీతో డ్రిప్‌, 10 ఎకరాల వరకూ 90శాతం సబ్సిడీతో డ్రిప్‌ వైఎస్‌ హయాం నుంచి ఈ 90 శాతం సబ్సిడీ అనంతలో అమలవుతోంది.
ఏడాదిలోపు హంద్రీ-నీవా పూర్తి ఐదేళ్లయినా పూర్తి చేయలేదు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు
జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తా ఆ ఊసే లేదు
పింఛన్ల అర్హతను 5 ఎకరాలుగా ఉంది.‘అనంత’లో మాత్రం 10 ఎకరాల వరకూ సడలింపు ఆ మేరకు జీఓ మాత్రం జారీ
రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తా పాక్షికంగా కూడా చెల్లించలేదు
సబ్బుల ఫ్యాక్టరీని నిర్మిస్తాం అబద్ధపు హామీ
హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తాం తీసుకున్న చర్యలు నామమాత్రమే
ఉద్యానవన కేంద్రం  లేదు 
సెంట్రల్‌ యూనివర్సిటీ  కేంద్రప్రభుత్వ రంగ సంస్థ
ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం  గుంటూరుకు తరలించి మోసం చేశారు
నూతన పారిశ్రామిక నగరం అతీగతీ లేదు
‘అనంత’ను స్మార్ట్‌సిటీగా చేస్తాం ఇంత అధ్వాన్నమైన కార్సొరేషన్‌ బహుశా రాష్ట్రంలో ఏదీ లేదు
టెక్స్‌టైల్‌పార్క్‌ లేదు
ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ క్లస్టర్‌ అదీ లేదు
సోలార్‌, విండ్‌ పవర్‌ హబ్‌  ఎన్‌పీ కుంట సోలార్‌ ఎన్‌టీపీసీ ప్లాంటు నిర్మించింది.ఇది గత ప్రభుత్వం ప్రతిపాదించిన హబ్‌
పెనుకొండలో ఇస్కాగ్‌ ప్రాజెక్టు లేదు
బీఈఎల్‌(భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌) కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీని ఏర్సాటుకు అప్పటి కేం‍ద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ శంకుస్థాపన చేశారు.
ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి పుట్టపర్తి అలాగే ఉంది
పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం ఏదీ లేదు
కుద్రేముఖ్‌ ఇనపఖనిజ ఆధారిత ప్రాజెక్టు గతంలో ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement