రజకులు, మత్స్యకారులు, ఇతర వర్గాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చుతాం. గాండ్ల, నగర, పూసల, కురచి, బోయ, పద్మశాలి తదితర కులాలను బీసీ డీ నుంచి బీసీ ఏకు మారుస్తాం.. అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నారావారు ఆనక రిక్తహస్తం చూపారు. మేనిఫెస్టోలో చేర్చిన విధంగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు ఇవ్వాలని అడిగితే.. ‘ఇయ్యమయ్యా... తొమ్మిదేళ్లు పాలించా.. ఎక్కువ మాట్లాడితే తోక కట్ చేస్తా’ అంటూ నాయీ బ్రాహ్మణులను బెదిరించారు. హామీని నిలబెట్టుకోమని అడిగిన మత్స్యకారుల తాట తీస్తానన్న చంద్రన్న.. ‘జయహో బీసీ’ అంటూ రాజమండ్రిలో చేపట్టిన ‘టీడీపీ బహిరంగ సభ’లో మాత్రం బీసీలపై వల్లమాలిన ప్రేమ వలకబోశారు. ఆత్మస్తుతికే ప్రాధాన్యం ఇస్తూ కాస్తైనా మొహమాటం లేకుండా పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను భలేగా కాపీ కొట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెదిరింపులకు దిగితే కుదరదని గ్రహించారో ఏమో.. తాయిలాలు ఎరవేస్తూ చాలా నైస్‌గా బీసీలను మరోసారి మోసం చేసే కార్యక్రమానికి తెరలేపారు.
నాలుగున్నరేళ్లుగా ఏం చేశారో మరి!
నోరు తెరిస్తే తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉంది అంటూ గతాన్ని వల్లెవేసే చంద్రబాబు.. గత నాలుగున్నరేళ్లుగా బీసీల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా ప్రత్యేక హోదా సంజీవని కాదు.. ప్యాకేజీ వస్తే అదే మహాభాగ్యం అని ఓసారి.. లేదు లేదు ప్రత్యేక హోదా కావాల్సిందే.. ఇన్నేళ్లు బీజేపీతో కుదరలేదు గానీ ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టి హోదా సాధిస్తాం అని మరోసారి స్వప్రయోజనాల గురించి ఆలోచించుకోవడానికే ఆయనకు సమయం చాలట్లేదు. ఇంకా బీసీ గురించి ఆలోచించాలని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయనలో ఆందోళన పెరిగిపోతుందో ఏమో.. అందుకే తాను పుట్టిందే బీసీల కోసం అన్నట్లు తెగ వరాలు కురిపిస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగా రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి ఢిల్లీకి వెళ్లడం వంటి పనులతో తీరిక లేకుండా ఉండే బాబుకు.. వైఎస్ జగన్ రూపంలో ఎక్కువగా శ్రమించాల్సిన అవసరమే లేకుండా పోయింది.
వైఎస్సార్ బాటలో..
ప్రజాసంకల్పయాత్ర చేపట్టి సంవత్సరం నాలుగు నెలల పాటు జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్.. ఏడాది క్రితమే బీసీల జీవన స్థితిగతులు, వారి జీవన ప్రమాణాల గురించి అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించిన సంగతి తెలిసిందే. స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను దగ్గరగా చూసిన వైఎస్సార్ సీపీ అధినేత.. ఏం చేస్తే బడుగు బలహీన వర్గాల బాధలు తీరతాయనే అంశంపై ఓ అవగాహనకు వచ్చారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. బీసీలకు ఒనగూర్చిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాల గురించి, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవించేందుకు నవరత్నాలు ప్రకటించారు. త్వరలోనే బీసీ గర్జన సభ పెట్టి తమ పార్టీ విధానాలను చెప్పేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అప్పుడే మేల్కొన్న చంద్రబాబు నిస్సిగ్గుగా వైఎస్సార్ సీపీ హామీలను కాపీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. హడావుడిగా జయహో బీసీ అంటూ ఓ సభను పెట్టేసి అచ్చంగా వైఎస్ జగన్ హామీలను తమ పార్టీవిగా చెప్పుకొంటూ భజన కార్యక్రమం కొనసాగించారు.
బోల్తా కొట్టించడం వెన్నతో పెట్టిన విద్య
రాజమండ్రి సభలో.. ఫెడరేషన్ కాకుండా కార్పొరేషన్లు పెట్టండని బీసీలు తనను అడిగారని చెప్పారని చెప్పిన చంద్రబాబు... వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉండి కూడా ఈ నాలుగన్నరేళ్లుగా బీసీల కోసం చేసేందేమిటని అడిగితే మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉండదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా?.. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారంటూ ఇష్టం వచ్చినట్లుగా అన్ని వర్గాల ప్రజలపై నోరు పారేసుకున్న చంద్రబాబు... ఎన్నికలు సమీపిస్తుంటే మాత్రం మరోసారి ముసుగు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అధికారం చేపట్టడానికి సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనది.. నిన్నటి దాకా బూతులు తిట్టిన పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న ఘనత ఆయనది.. అందుకే అధికారంలో ఉండగా గుర్తురాని సంక్షేమ పథకాలు దిగిపోతున్న సమయంలో ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం పట్ల ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిమ్మిని బమ్మి చేసైనా సరే ఎదుటి వారిని బోల్తా కొట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కదా మరి.
Comments
Please login to add a commentAdd a comment