
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను నిర్ణయించానని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో ఆదరణ కరువైంది. నోరుతెరిస్తే ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ అని చెప్పుకునే ఆయనతో ..ఏ ఒక్క జాతీయ స్థాయి నేతా పట్టుమని ‘4 నిమిషాలు’కూడా మాట్లాడలేదు. హాస్యాస్పదంగా సాగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలో ఇంకా చాలా విశేషాలున్నాయి..
ఏపీలో గడిచిన నాలుగేళ్లూ సాగింది ఎన్డీఏ పాలనే అయినా.. కేంద్ర ఎన్డీఏ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను జాతీయ నేతలకు వివరించడానికే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఇందుకోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, స్లైడ్‌షోలు, పుస్తకాల వంటి సరంజామాతో భారీగానే ప్రిపేర్ అయ్యారు. కానీ తీరా పార్లమెంట్‌కు వెళితే.. బాబుగారిని కలవడానికి ఏ ఒక్కరూ ఆసక్తిచూపలేదు. దీంతో ఇతర పార్టీల ఎంపీలను, కొద్దోగొప్పో గుర్తింపు ఉన్న నాయకులను బతిమాలి తీసుకొచ్చే బాధ్యతను టీడీపీ ఎంపీలపై పడింది.
బాబ్బాబూ.. ప్లీజ్..: టీడీపీ ఎంపీలు రెండు బృందాలుగా విడిపోయారు. సభ వాయిదా అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాలులో అక్కడక్కడా కూర్చున్న ఎంపీలను, అటుగా వచ్చే కీలక నేతలను కలిసి ‘బాబ్బాబూ.. ఒక్కసారి మా బాబును కలవరా..’ అని ఒక బృందం బతిమాలుకోవడం అక్కడున్నవారికి నవ్వుతెప్పించింది. ఎంత పిలిచినా ఎవరూ రాకపోవడంతో కొంత సేపటికి చంద్రబాబే స్వయంగా వెళ్లి ఆయా నేతలను పలకరించడం మొదలుపెట్టారు. అలా బాబు ఎవరితో మాట్లాడినా ఫోటోలు తీసే పనిని రెండో ఎంపీల బృందం చేపట్టింది. ‘చూడు చూడు.. నేను 48 ఫొటోలు తీశాను..’అని ఎంపీ మురళీమోహన్ అనడం పరిస్థితిని స్పష్టంగా తెలియజేసింది. ఈ విధంగా బాబును బిజీగా ఉంచడానికి టీడీపీ ఎంపీలు పడిన పాట్లు అన్నీ ఇన్నీకావు.
బాబు ఎవరెవరిని కలిశారు?: పార్లమెంట్ సెంట్రల్ హాలు బెంచిల మధ్య తిరుగుతున్నా చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. మూడు గంటలపాటు అక్కడ గడిపిన ఏపీ సీఎం.. ఎలాగోలా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పవార్ కూతురైన ఎంపీ సుప్రియా సూలే, ఎన్‌సీ నేత ఫారూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, జ్యోతిరాదిత్య సిధియాలను మాత్రమే కలవగలిగారు. అప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జోలికి పోయే వీలేలేక.. ఏపీకి జరిగిన అన్యాయాలను బాబు బ్రీఫ్ చేశారు.
జైరాం ఘాటు కౌంటర్: అదే సెంట్రల్ హాలులో ఎదురుపడ్డ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌తో చంద్రబాబు సంవాదం బెడిసికొట్టింది. ‘రాష్ట్రాన్ని విభజించి అన్యాం చేశారు’ అని బాబు పేర్కొనగా.. ‘అయ్యో, మీరు లేఖ ఇస్తేనేకదా మేం విభజించింది’ అని జైరాం ఘాటు కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment