సాక్షి, అమరావతి: టెక్నాలజీయే తాను.. తానే టెక్నాలజీ.. అని చెప్పిన నోటితో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్ కావాలంటూ రాద్ధాంతం చేయడం.. తన ఓటు తనకే పడిందో లేదో తెలియడం లేదని అనుమానాలు వ్యక్తం చేయడం.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధికారులపై నోరు పారేసుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఏమో అయిందని సాధారణ ప్రజలు, సొంత పార్టీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అభద్రత, అసహనంతో పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే ఓటమిని ముందే గ్రహించి.. దాన్ని జీర్ణించుకోలేక గ్రౌండ్‌ను సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీ వెళ్లి చేస్తున్న హడావుడి అంతా ఓటమిని అంచనా వేసిన నాయకుడు చేసే చేష్టలని చెబుతున్నారు.
ఈవీఎంలను మొదట ఎందుకు వ్యతిరేకించలేదు?
ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈవీఎంల మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్యాన్ని మిషన్ల చేతిలో పెడతారా? అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు గత ఎన్నికల్లో వాటి ద్వారానే గెలిచిన విషయాన్ని ఎందుకు గమనంలోకి తీసుకోవడంలేదనే ప్రశ్న అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన నంద్యాల ఉప ఎన్నికలోనూ ఈవీఎంలే వాడారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థే గెలిచారు. అంతకు ముందు 1999లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపొందింది. అప్పటి నుంచి ఈవీఎంలతోనే దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. 2004, 2009 ఎన్నికలూ ఈవీఎంలతోనే జరిగాయి. అప్పుడు వాటిని వ్యతిరేకించని చంద్రబాబు హఠాత్తుగా ఈ ఎన్నికల్లోనే కొత్తపల్లవి అందుకోవడానికి రాజకీయ అంశాలే కారణమని చెబుతున్నారు.
అంతా టెక్నాలజీ అంటూ.. ఈవీఎంలు వద్దంటే ఎలా?
టెక్నాలజీ లేకపోతే బతుకులే లేవని, దాంట్లో తాను లబ్ధ ప్రతిష్టుడినని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలను వ్యతిరేకించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 11వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌లో 30 శాతం ఈవీఎంలు పనిచేయ లేదని చంద్రబాబు చేసిన ఆరోపణపై ఎన్నికల ప్రధాన అధికారి వెంటనే వివరణ ఇచ్చారు. అయినా ఈ విషయాన్ని రచ్చ చేయాలని నిర్ణయించుకున్న ఆయన అదేపనిగా విమర్శలు చేస్తూనే ఉండటంపై టీడీపీ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదని, లేనిపోని సమస్యలు సృష్టిస్తూ తనంతట తాను అందరిలో పలుచన అయిపోతున్నారని వాపోతున్నారు. ఈవీఎంలపై లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకు నేర చరిత్ర ఉన్న వేమూరి హరి ప్రసాద్‌ను పంపడాన్ని ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడం కచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమేనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి ఓటేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని, తన ఓటు టీడీపీకే పడిందో లేదో తెలియడం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్వపక్షీయులకు సైతం ఆశ్చర్యం కలిగించాయంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఈ స్థాయి నేలబారు విమర్శలు చేస్తారని పార్టీ నాయకులు, శ్రేణులతో సహా ఎవరూ ఊహించలేదని సీనియర్ రాజకీయ నేతలు సైతం అశ్చర్యపోతున్నారు.
అధికార యంత్రాంగంపై అభాండాలేమిటి?
ఎన్నికల కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు.. కోవర్టుగా అభివర్ణించడంపై అధికార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఆయన నడిపిన ప్రభుత్వంలోనే పని చేసిన ఒక ఉన్నతాధికారిపై అంత దారుణమైన అభాండం వేయడం ఏమిటని సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. నియమితులైన అధికారులంతా చంద్రబాబు ప్రభుత్వంలో పని చేస్తున్న వారే. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పని చేసిన అధికార యంత్రాంగమంతా ప్రభుత్వంలో మొన్నటివరకూ ఆయన కనుసన్నల్లోనే పని చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదారుగురు అధికారులను బదిలీ చేస్తే మిగిలిన యంత్రాంగంమంతా కోవర్టులైపోయినట్లు చంద్రబాబు మాట్లాడడం సరికాదనే భావన సొంత పార్టీలోనే వినిపిస్తోంది.
విపరీత ప్రవర్తన ఆయన మానసిక స్థితిని తెలుపుతోందా!
చంద్రబాబు ఎందుకు ఇలా వింతగా, విపరీతంగా ప్రవర్తిస్తున్నారనే దానిపై రకరకాల అనుమానాలు సొంత పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మానసికంగా ఏమో అయిందేమోనని అంతర్గత సంభాషణల్లో ముఖ్య నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘మా బాస్ ఉన్నట్లుండి తీవ్ర స్థాయిలో మమ్మల్ని కోప్పడుతున్నారు. ఎందుకు అలా అన్నారు.. ఏం తప్పు చేశామని పరిశీలించుకుంటే మాకు ఏమీ కనిపించడంలేదు. ఇదే విషయాన్ని మరో నేత వద్ద ప్రస్తావించినా, ఆయన మాటలు ఇప్పుడేమీ పట్టించుకోవద్దు. ఎన్నికల్లో మన పరిస్థితి మనకు అర్థమైపోతుంది కదా... మరి పార్టీకి బాస్ అయిన ఆయన మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి’అని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. తానే సర్వస్వం అయినట్లు, ఆంధ్ర రాష్ట్రం అంటే తాను, టీడీపీ అని రకరకాలుగా చేస్తున్న చిత్రీకరణలపైనా విస్మయం వ్యక్తమవుతోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆయన ఇలా ప్రవరిస్తున్నారనే ప్రచారం అన్ని వర్గాలతో పాటు ఉన్నతాధికారుల చర్చల్లోనూ జరుగుతుండటం గమనార్హం. ఎన్నికలు ఫార్స్ అని, కమిషన్ చేతగానిదని చెప్పడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విచక్షణ కోల్పోయి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, కంట్రోల్‌లో లేని హావభావాలు ఆయన మానసిక స్థితి సరిగా లేదని తేటతెల్లం చేస్తున్నాయని మానసిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment